Wednesday, 4 November 2026

జగిత్యాల, యాదాద్రి జిల్లాల్లో కార్డెన్‌ సర్చ్‌

అనుమతిలేని వాహనాలు స్వాధీనం

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): వివిధ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇది సాధారణంగా మారింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో డీఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పట్టణంలోని సుల్తానాపుర కాలనీలో ఉదయం నుంచే తనిఖీలు చేపట్టారు. క్వింటాలు రేషన్‌ బియ్యం, 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.మెట్‌ పల్లి పరిధిలోని ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లతో కలిసి ఈ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. కాలనీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా కాలనీ వాసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. ఇకపోతే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు డీసీపీ రామ్‌చంద్రారెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీసుల బృందంతో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అనంతరం భువనగిరి డీసీపీ రామ్‌చంద్రరెడ్డి మాట్లాడారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్‌, ఒక క్వాలిస్‌, ఒక కారుతో పాటు బెల్ట్‌ షాప్‌ నిర్వహిస్తున్న ఇద్దరిని, నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పట్టుకున్న వాహనాలకు సరైన పత్రాలు చూపించిన వారికి వాహనాలు ఇస్తామని స్పష్టం చేశారు. పత్రాలు లేని వాహనాలను కేస్‌ నమోదు చేస్తామని అన్నారు. కార్డన్‌ సెర్చ్‌ కు ప్రజలు సహకరిస్తున్నారని చెప్పారు. ఇకపై కూడా తరుచుగా ఇలాంటి తనిఖీలు చేపడతామన్నారు. శాంతి భద్రతల రక్షణలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.