Monday, 2 November 2026

జనగాం, మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్ల బదిలీలు దేనికి సంకేతం?

అంతుచిక్కని కెసిఆర్‌ వ్యూహంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన
పార్టీకి అప్రతిష్ట రాకుండా ముందస్తు కసరత్తు
గెలుపు గుర్రాల కోసం ఇప్పటి నుంచే వడపోత
హైదరాబాద్‌,జనవరి5(జ‌నంసాక్షి): మొన్నటి ఐఎఎస్‌ల బదిలీల్లో ఉమ్మడి వరంగల్‌ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడ్డ జనగాం, మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్లపైనా  వేటు పడింది. వీరిని ఇక్కడి నుంచి బదిలీ చేసి ఇన్‌ఛార్జిలకు బాధ్యతలు అప్పగించారు. అంటే ఈ రెండు జిల్లాల్లో స్థానిక అధికార టిఆర్‌ఎస్‌  పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలెక్టర్లకు విభేదాలు ఉన్నాయి. ఈ బదిలీల వల్ల తాత్కాలికంగా ఎమ్మెల్యేలు సంతసించి ఉండవచ్చు. కలెక్టర్లను  బదిలీ చేయడం ద్వారా ఎమ్మెల్యేలకు ఊటర కలగించేలా సిఎం కెసిఆర్‌ నిర్ణయం తీసుకున్నారని భావించవచ్చు. తమవాదనే కరెక్ట్‌ అని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు భావించి ఉండవచ్చు. అయితే సిఎం కెసిఆర్‌ ఆలోచన మరో రకంగా ఉండివుండవచ్చు. టిఆర్‌ఎస్‌పై స్థానికంగా వ్యతిరేకత రాకుండా, అది మరింతగా విస్తృతి కాకుండా చర్య తీసుకుని ఉంటారు. అందులో భాగంగానే ప్రస్తుతానికి ఎమ్మెల్యేలను మందలించకుండా కలెక్టర్ల బదిలీతో సరిపెట్టి ఉంటారన్న ప్రచారం కూడా ఉంది. ఇది రాబోయే ఎన్నికల్లో అనుసరించే వ్యూహంలో భాగం కూడా అయివుండవచ్చు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌లపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. వచ్చే ఎన్నికల్లో వీరికి టిక్కెట్లు అనుమానమన్న ప్రచారం ఉంది. మరో ఏడాదిలో ఎన్నికలకు వెళ్లే ముందు ఈ ప్రభావం పార్టీపై పడకుండా సిఎం కెసిఆర్‌ జాగ్రత్త పడి ఉంటారు. ఇకపోతే వందకు పైగానే సీట్లు గెలుస్తామని, సర్వేలు మనకు అనుకూలంగా ఉన్నాయని పదేపదే ప్రకటించిన సిఎం కెసిఆర్‌ ఇప్పటి నుంచే గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నట్లుగా ఉంది. కూడికలు, తీసివేతల కసరత్తు జరుగుతోందనే సంకేతాలు ఉన్నాయి.  నియోజకవర్గాల పెంపుపై పెట్టుకున్న ఆశలు గల్లంతవడం, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలతో ఆశావహుల జాబితా పెరిగిపోవడంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టికెట్ల విషయంలో ఇప్పట్నుంచే ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నరలోపే సమయం ఉండటంతో ముందస్తు కసరత్తు మొదలుపెట్టారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు టికెట్‌ ఆశావహులు ఉండటంతో వడపోత కార్యక్రమం మొదలైనట్టు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కెసిర్‌కు సంబంధించినంత వరకు ఆయన తీసుకున్న నిర్ణయమే చివరిది. ఆయనను ఎదిరించి టిఆర్‌ఎస్‌లో మనగలిగే వారు లేరు. ఎవరు గెలుస్తారని భావిస్తారో వారికే ఇక్కెట్‌ ఇస్తారు. కాదంటే, కలర్‌ ఎగరేస్తే బయటకు పంపడం ఖాయం. అందుకే  వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని వివిధ సందర్భాల్లో తనను కలుస్తున్న జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ చెబుతున్నారు. సిట్టింగ్‌లందరికీ వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని హావిూ ఇస్తున్నా.. తెర వెనుక మాత్రం నేతలపై కట్టుదిట్టంగా సర్వే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పనితీరు సరిగాలేని వారు, ప్రజల్లో ఆదరణ కోల్పోయిన వారు, నియోజకవర్గాల్లో వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యేల జాబితా తయారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జనగామ, మహబూబాబాద్‌ సంఘటనలే ఇందుకు ఉదాహరణగా చూడాలి. ఇలా అన్ని నియోజకవర్గాలపైనా కెసిఆర్‌ పట్టు బిగించారు.. ఎవరిసత్తా ఏంటన్నది బాగా తెలుసు. తెలంగాణ ఏర్పడ్డ సమయంలో వచ్చిన ఎన్నికలు కావడం, ఉద్యమనేతగా కెసిఆర్‌పై ఉన్న నమ్మకం వల్ల ప్రజలు ఆయన చెప్పిన వారికి ఓటేశారు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రజల్లో విశ్వసనీయత లేకుంటే తెలంగాణ పేరు చెప్పినా, కెసిఆర్‌ పథకాల గురించి చెప్పినా ఓట్లు పడవని తెలుసు. సర్వేలు, వివిధ వర్గాల ద్వారా తెప్పించుకుంటున్న సమాచారం, నిఘా విభాగాలు అందిస్తున్న నివేదికలతో ప్రజలకు దగ్గరగా ఎవరుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో వారి విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశాలపై అధినేత దృష్టి సారించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతం అయ్యాయని, వివిధ వర్గాల ప్రజల్లోకి చొచ్చుకువెళ్లామని, కనీసం వంద సీట్లు గ్యారంటీ అని పేర్కొంటున్నా, స్థానిక నేతల ఇమయేజ్‌ బాగా లేని చోట గెలవడం కష్టం కానుందని అధినేత కెసిఆర్‌కు తెలుసు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ తొలినాళ్ల నుంచి పనిచేస్తున్న నేతలు  కూడా ఇప్పుడు టిక్కెట్ల కోసం ఆశిస్తున్నారు. 119 స్థానాల్లో వీరందరి భర్తీ చేయాలి. అలాగని భవిష్యత్‌ను తాకట్టు పెట్టే నిర్ణయం తీసుకోవడానికి కెసిఆర్‌ సిద్దంగా లేరు. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల అనుకూల ఫలితాలు వస్తున్నా.. ఎమ్మెల్యేల విషయానికి వచ్చే సరికి తేడా ఉందని చెబుతున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే స్థానిక నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోబోతున్నారని సమాచారం. సిట్టింగులు అందరికీ టికెట్లు దక్కుతాయని పదేపదే ప్రకటిస్తున్నా.. పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని అర్థం అవుతోంది.  దీంతో సహజంగానే తమ పరిస్థితిపై ఒకింత స్పష్టత ఉన్న ఎమ్మెల్యేలు పనితీరును మెరుగు పరుచుకోవడం ద్వారా అధినేత కేసీఆర్‌ మనసు చూరగొనేందుకు నియోజకవర్గాలకే పరిమితమై వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.మరోవైపు  సిటింగ్‌ ఎమ్మెల్యే ఉన్న స్థానాల్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో స్థానం నుంచి సగటున నలుగురు, ఐదుగురు నేతలు టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో గెలుపు గుర్రాల కోసం వడపోత చేపట్టినట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 63 సీట్లు గెల్చుకుంది. తర్వాత వివిధ పార్టీల నుంచి 25 మంది గులాబీ కండువాలు కప్పు కున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 88కి చేరింది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ఆశతో ఎక్కువ మంది టీఆర్‌ఎస్‌ వైపు చూశారు. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేరారు. కొందరికి ఎమ్మెల్సీలు,మరికొందరికి రాజ్యసభ, ఇంకొందరికి నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టారు. అయినా అసెంబ్లీలో కూర్చోవాలని ఉవ్వీళ్లూరుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. వీరంతా వెయ్యిమందికి పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. సర్వేల ద్వారా సేకరిస్తున్న ఈ సమాచారంతో ఎవరు అర్హులో కాదో అన్న వడపోతలో అధినేత కెసిఆర్‌ నిరంతరంగా ఇప్పటినుంచే కసరత్తులో ఉన్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఉన్న 88లో చాలామందికి టిక్కెట్లు దక్కకపోవచ్చు. అలాగని ఇందులో ఎవరైనా పార్టీ వీడి బయటకు వెళ్లినా రాజకీయంగా తెరమరుగు కావడం ఖాయంగా ఉంది.