Thursday, 5 November 2026

జనసేన మాతోనే..

పవన్‌ ఈ సారి వైసీపీకి మద్దతిస్తానని నాతో చెప్పాడు

సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌

హైదరాబాద్‌, జూన్‌22(జ‌నం సాక్షి ) : 2019 ఎన్నికల్లో పవన్‌ వైసీపీకి మద్దతిస్తారని.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తనతో చెప్పారని వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి తన మద్దతు తెలుపుతానని పవన్‌ తనతో స్వయంగా చెప్పారన్నారు. అంతేకాదు.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని, అవినీతి చేయరన్న ఉద్దేశంతో తాను సమర్థించానని పవన్‌ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అయితే నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు ¬దా సాధించలేకపోయారని, అవినీతి పెరిగిపోతోందని.. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారని వరప్రసాద్‌ చెప్పుకొచ్చారు. 2019లో మద్దతంటూ ఇస్తే వ్యక్తిగతంగా అన్యాయం జరిగిన కష్టజీవి జగన్మోహన్‌రెడ్డికి సపోర్ట్‌ చేస్తానని పవన్‌ చెప్పారని.. ఇది వాస్తవమని.. ఆయన అభిప్రాయం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నానని ఈ వైసీపీ మాజీ ఎంపీ బాంబు పేల్చారు. ఇన్నాళ్లూ పవన్‌, జగన్‌ కలిసి బీజేపీ ఆడిస్తున్నట్లు ఆడుతున్నారన్న టీడీపీ ఆరోపణలకు వరప్రసాద్‌ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఏదేమైనా ఈ వైసీపీ మాజీ ఎంపీ ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.