Thursday, 5 November 2026

జిల్లాకు ఒక క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ సెంటర్‌

ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌ పట్ల అవగాహన కలిగి ఉండాలి

తొలిదశలో గుర్తిస్తే వ్యాధి భారి నుంచి బయటపడవచ్చు

క్యాన్సర్‌ వ్యాధి నిర్మూలనలో బసవతారక ఆస్పత్రి సేవలు అమోఘం

తెరాస ఎంపీ కవిత

ఇద్దరు చంద్రులు ఎన్టీఆర్‌ శిష్యులే

క్యాన్సర్‌ ఆస్పత్రి పురోగతిలో ఇరు ప్రభుత్వాల సహకారం అభినందనీయం

క్యాన్సర్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచుతాం

ఆస్పత్రి చైర్మన్‌, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

హైదరాబాద్‌, జూన్‌22(జ‌నం సాక్షి ) : ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, జిల్లాకు ఒక క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఎంపీ కవిత అన్నారు. హైదరాబాద్‌ లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి 18వ వార్షికోత్సవ వేడుకలకు శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు ఎంపీ కవిత, బాలయ్య బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కవిత మాట్లాడారు. క్యాన్సర్‌ ఆస్పత్రిని బాలకృష్ణ అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. క్యాన్సర్‌ కారణంగా ప్రతీ ఏడాది ఐదున్నర లక్షల మంది చనిపోతున్నారన్నారు. ఏటా ఏడు లక్షల మందికి కొత్తగా క్యాన్సర్‌ వస్తోందన్నారు. క్యాన్సర్‌ విషయంలో ఎంత చేసినా? ఇంకా చేయాల్సి ఉందన్నారు. బ్రేస్ట్‌ కాన్సర్‌ ,సర్వైవకాల్‌ కాన్సర్‌ పైన మహిళలు ప్రతీ ఏడాది పరీక్షలు చేయించుకోవాలన్నారు. కాన్సర్‌ ని తొలిదశలో గుర్తిస్తే తగ్గించుకోవచ్చన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఆరోగ్యశాఖపైన ప్రత్యేక శ్రద్ద పెట్టారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బోదకాలు ఉన్న 50 వేల మందికి ప్రతీ నెల వెయ్యి రూపాయల పింఛన్‌ ఇస్తున్నట్లు తెలిపారు. డయాలిసిస్‌ చేయించుకునే వారి కోసం ఫ్రీగా బస్‌ పాసులు అందిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో డయాలిసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కవిత చెప్పారు. అనంతరం హిందూపురం ఎమ్మెల్యే, ఆస్పత్రి చైర్మన్‌ బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇద్దరు చంద్రులు దివంగత నేత ఎన్టీఆర్‌ శిష్యులే అన్నారు. కేన్సర్‌కు ఎవ్వరూ బయపడకండి.. అందరికి బసవతారం ఆస్పత్రి అండగా ఉంటుందని పేర్కొన్నారు. తాను ఏ పని చేయాలన్న నాన్నగారు ఆదర్శమన్నారు. ‘మా అమ్మ కేన్సర్‌ వ్యాధితో మరణించారు. ఆమె కోరిక మేరకు నాన్న బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ప్రారంభించారు. 40 పడకలతో మొదలైన హాస్పిటల్‌ నేడు 500 పడకలకు ఎదిగింది. క్యాన్సర్‌ వ్యాధితో కంటే.. వాళ్లు భయంతోనే సగం మంది మరణిస్తున్నారు. కానీ, వైద్యులు చూపే ప్రేమకే సగం క్యాన్సర్‌ పోతోంది. బెస్ట్‌ మేనేజ్మెంట్‌ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్టీఆర్‌ ఒక విజన్‌తో ఆస్పత్రి స్థాపించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రి ఎదుగుదలకు తోడ్పడుతున్నాయని అన్నారు. మహిళల కోసం హాస్పిటల్‌లో స్వీర్నింగ్‌ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమాజంలో క్యాన్సర్‌ని ఎదురించి గెలిచిన ప్రతి ఆడబిడ్డకు మా అమ్మ ఆశీర్వాదం ఉందని నేను అనుకుంటానని బాలకృష్ణ పేర్కొన్నారు. కేన్సర్‌తో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని ఆయన అన్నారు. ఆసుపత్రికి ట్యాక్స్‌ రద్దు చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు తరుపునధన్యవాదాలు తెలుపుతున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. రాబోయే కాలంలో క్యాన్సర్‌పై మరింత అవగాహన పెంచి ప్రజల నుంచి ఆ వ్యాధిని దూరం చేసేలా బసవతారక క్యాన్సర్‌ ఆస్పత్రికి కృషి చేస్తుందని బాలకృష్ణ తెలిపారు. హీరోయిన్‌ శ్రీయ మాట్లాడుతూ.. బసవతారకం ఆస్పత్రి వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కేన్సర్‌ అనేది భయంకరమైన వ్యాధి. అంతేకాక ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంతో మందికి ఈ ఆస్పత్రి పునర్జన్మ ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. భయంకరమైన వ్యాధిని ఎదుర్కొవాలంటే ఈ విధమైన ఆస్పత్రులు ఇంకా రావాలని నటి శ్రియ అన్నారు. బసతారకం ఆస్పత్రి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే అని డైరెక్టర్‌ బోయపాటి శ్రీను అన్నారు. సంకల్ప బలం అద్భుతంగా ఉన్న ఒక శక్తి దివంగత నేత ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఆయనకు ప్రజల పట్ల ఉన్న బాధ్యతనే ఈ బసవతారకం అని చెప్పారు. ఎన్టీఆర్‌ ఆశయాలను బాలకృష్ణ కాపాడుతున్నారని, ఆసియాలోనే నంబర్‌ వన్‌ ఆస్పత్రి బసవతారకమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎంపీ కవిత కాన్సర్‌ జయించిన పేషేంట్ల ని సన్మానించారు.