హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో తెరాస కీలక పాత్ర పోషించనుందని తెరాస అధినేత కేసీఆర్ చెప్పారు. కొత్తగా ఏర్పడే కూటమిలో తమ పార్టీ కీలక పాత్ర పోషించనుందన్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీతో తమ పార్టీ నేత కేశవరావు సంప్రదింపులు ప్రారంభించినట్లు వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కేశవరావుకు పార్టీ సెంక్రటరీ జనరల్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. ఇదే కాకుండా పార్టీ జాతీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా కూడా కేకే బాధ్యతలు నిర్వర్తిస్తారని కేసీఆర్ అన్నారు. తమ పార్టీ భవిష్యత్తులో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఇతర రాజకీయ పార్టీల్లో నేతలు మరికొంతమంది తమ పార్టీలో చేరే అవకాశం ఉందని… ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నట్లు కేసీఆర్ స్పష్టంచేశారు. తాను చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనలేదన్న ఆరోపణలను కేసీఆర్ ఖండించారు. తెలంగాణ బంద్ పిలుపు ఏకపక్ష నిర్ణయమన్న విమర్శలను ఆయన తప్పుపట్టారు. బంద్ నిర్వహించాలనేది తమ పార్టీ సొంత నిర్ణయమని, దీనిపై ఇతర పార్టీలతో చర్చించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. తమ పార్టీ తదుపరి ఉద్యమ కార్యాచరణను నేడు జరగనున్న విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.




