హైదరాబాద్,సెప్టెంబర్9(జనంసాక్షి): హైదరాబాద్‌లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ, సీపీఎం, తెలంగాణ చేనేత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిఎస్టీతో తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని, మోయలేని పన్నులుకట్టాల్సి వస్తోందని వీరు ఆందోళనకు దిగారు. కౌన్సిల్ సమావేవానికి వస్తున్న కేంద్ర ఆర్థికమంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైటెక్స్ వద్దకు వచ్చిన సీపీఐ నేత నారాయణతోపాటు ఇతర నేతలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. జీఎస్టీలో వెంటనే కేంద్రం సవరణలు తీసుకురాకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయా సంఘాల నేతలు హెచ్చరించారు. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులపై ఎటువంటి జీఎస్టీని అనుమతించ వద్దని అన్నారు. నాయకులు అందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శేరిలింగంపల్లిలో ముందస్తుగా కొందరు సీపీఐ నేతలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ జిఎస్టీ పేరుతో బాదుడే తప్ప లాబం లేదన్నారు. నష్టపోతున్న రంగాలను ఆదుకోకుండా చేస్తున్నారని అన్నారు. ప్రధానంగా చేనేత రంగం తీవ్రంగా నష్టపోతోదన్నారు.




