జియాగూడ(హైదరాబాద్): జియాగూడ కేశవస్వామినగర్‌లో మూసీనది ఒడ్డున బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 32 గుడిసెలు దగ్ధమయ్యాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వలసదారులు జియాగూడలో మూసీనది ఒడ్డున గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. బుధవారం ఉదయం ప్రమాదవశాత్తూ గుడిసెలకు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మూసీనది ఒడ్డున చెత్త తగలబెట్టడం వల్లే మంటలు గుడిసెలకు అంటుకున్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుడిసెల్లో దాచుకున్న నగదు, ఆభరణాలు దగ్ధమైనట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.