జిల్లా పోరు జై..!
ఉద్యమించేందుకు ముందుకొచ్చిన న్యాయవాదులు..
మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ప్రజా తీర్పును గౌరవించకపోతే ప్రజా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పలు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనలో మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయకుండా పాలక పక్షాలు ప్రజలను మోసం చేశాయని మిర్యాలగూడ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణా రెడ్డి ఎల్లయ్య లు అన్నారు. మంగళవారం మిర్యాలగూడలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ భౌగోళికంగా ప్రభుత్వానికి ఆదాయపరంగా అనుకూలంగా ఉన్న మిర్యాలగూడ జిల్లా చేయకపోవడం శోచనీయమన్నారు. జిల్లాల ఏర్పాటులో వివక్ష చూపారని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమంలో న్యాయవాదులు ముందుండి పోరాడుతరని అన్నారు. జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేయాలని సూచించారు. దామరచర్ల నుండి మిర్యాలగూడ వరకు పాదయాత్ర చేపట్టాలని రిలే నిరాహార దీక్షను తక్షణం ప్రారంభించాలని అందుకు అవసరమైన సహాయ సహకారాలు న్యాయవాదులు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి కన్వీనర్ మాలోతు దశరధ నాయక్, సభ్యులు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి,బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు యాదవ సంఘం డివిజన్ అధ్యక్షులు చిమట ఎర్రయ్య, ఎంఐఎం జిల్లా సహాయ కార్యదర్శి ఫారూఖ్, డాక్టర్ రాజు, సామాజిక తెలంగాణ ప్రధాన కార్యదర్శి జయరాజు, బి ఎం పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రగిరి అంజయ్య నియోజకవర్గ ఇన్చార్జి నీలకంఠ నాయక్, సీనియర్ న్యాయవాదులు టిడిపి సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ అరుణ్ కుమార్, సత్యనారాయణ గూడూరు శ్రీనివాసరావు, పుల్లారెడ్డి శ్రీను సైదులు, ప్రసాద్ ప్రవీణ్ బాబు తదితరులు పాల్గొన్నారు,
ఉద్యమానికి మాజీ జెడ్పీ చైర్మన్ మద్దతు:-
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ సీడీ రవికుమార్, నాగార్జునసాగర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మువ్వ అరుణ్ కుమార్, తెలంగాణ జేఏసీ మాజీ కన్వీనర్ మాలి ధర్మపాల్ రెడ్డి, ఇబీసీ జిల్లా అధ్యక్షులు పుట్లూరు పుల్లారెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. జిల్లా ఏర్పాటు ఉద్యమంలో ముందుండి పోరాడుతామని, ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు.