Thursday, 5 November 2026

జిహెచ్ఎంసి పరిధిలో చెత్త సేకరణ విధిగా జరగాలి – శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 25( జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు రోజుకి చెత్తాచెదారం పేరుకుపోయి పరిస్థితులు దిగజారుతున్నాయని, నివారణ చర్యల్లో భాగంగా జిహెచ్ఎంసి ఇంటింటికి చెత్త సేకరణ వాహనాలను ప్రవేశపెట్టినా ఫలితం అంతంత మాత్రమేనని శేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ భాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఈ మేరకు గురువారం జిహెచ్ఎంసి అధికారులూ, సాట్ వెహికల్ నిర్వాహకులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నగరంలో చెత్త పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని అన్నారు. జిహెచ్ఎంసిని పరిశుభ్రంగా ఉంచాలని భావించిన ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ క్రింది స్థాయిలో అది సత్ఫలితాలను ఇవ్వకపోవడం అధికారుల బాధ్యతారహిత్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు. ఇకనుంచైనా పరిస్థితులలో ఖచ్చితమైన మార్పు రావాలని, సాట్ వెహికల్ నిర్వాహకులు ప్రతిరోజు తప్పకుండా ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. సాట్ వెహికల్ పనితీరుపై జిహెచ్ఎంసి అధికారుల పర్యవేక్షణ చాలా అవసరమని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రతి ఇంటి నుండి చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించగలిగితే సగం సమస్య అక్కడే పరిష్కారం అవుతుందని నాగేందర్ యాదవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. లింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట చెత్త పేరుకుంటుండడంతో అది కుళ్లిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతూ అనేక రకాల వ్యాధులకి ఆస్కారమయ్యే అవకాశం ఉందని, కాబట్టి తక్షణమే గ్రేటర్ అధికారుల పర్యవేక్షణలో చెత్త సేకరణ కార్యక్రమం అక్కడ బందీగా ముందుకు సాగాలని రాగం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఏఎమ్ హెచ్ఓ నగేష్ నాయక్, ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ శివహరి, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, బాలరాజ్, నాగేశప్ప, విజయ్ తదితరులు పాల్గొన్నారు.