* మైసమ్మ తల్లికి పూజలు చేసిన మహిళలు
జూలూరుపాడు, జులై 17, జనంసాక్షి:
ఆషాఢమాసం సందర్భంగా ప్రతి ఏటా అమ్మవారికి భక్తులు నైవేద్యాలు సమర్పించి ఘనంగా పూజలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఆదివారం జూలూరుపాడు గ్రామంలోని శ్రీ కోట మైసమ్మ తల్లికి భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా ఆషాఢమాస బోనాల వేడుక నిర్వహించారు. బోనాల జాతర కోసం రెండు, మూడు రోజులు ముందు నుంచే గ్రామస్తులు వేడుకలు జరుపుకునేందుకు సిద్దమయ్యారు. గ్రామ కూడలిలోని శ్రీ సీతారామాలయం వద్దకు మహిళలు ఉదయాన్నే బోనాలను నెత్తిన పెట్టుకుని చేరుకున్నారు. అక్కడి నుంచి మేళతాళాలతో మహిళలతో పాటు గ్రామ పెద్దలు మైసమ్మ తల్లి ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులు సమర్పించారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను అప్పగించి మొక్కులు తీర్చుకున్నారు. పాడిపంటలు సమృద్ధిగా కలగాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢమాస బోనాల వేడుకకు మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావడంతో గ్రామం భక్తి పారవశ్యమైంది.




