ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా దేవరాజు దివ్య బుధవారం ఉదయం 11.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జేసీగా కొనసాగిన సురేంద్రమోహన్ ఆమెకు చార్జి అప్పగించి అభినందించారు. జేసీ కార్యాలయానికి వచ్చిన దివ్యకు అడిషనల్ జాయింట్ కలెక్టర్ కె.బాబూరావు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకారం అనంతరం దివ్య కలెక్టర్ ఇలంబరితిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
భూసమస్యలపై ప్రధాన దృష్టి: దివ్య
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివ్య మాట్లాడారు. జిల్లాలోని భూ సమస్యలు, రిలీఫ్, రీహాబిటేషన్, సివిల్ సప్లయిస్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. గతేడాది ఫిబ్రవరి 14న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించి 11 నెలలపాటు బాధ్యతల్లో కొనసాగానన్నారు. జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉన్నట్లు చెప్పారు.
తాను పనిచేస్తున్న జిల్లాకే పదోన్నతిపై జాయింట్ కలెక్టర్‌గా రావడం సంతోషంగా ఉందన్నారు. గిరిజనులకు భూమిపై హక్కులు కల్పించడానికి జాయింట్ కలెక్టర్‌గా తనకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. భూ సమస్యలు, సివిల్ సప్లయిస్, రిలీఫ్, రీహాబిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ప్రజలకు మేలు కలిగేలా వ్యవహరిస్తానన్నారు. వారి సమస్యలు సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.
అభినందనల వెల్లువ
నూతన జేసీగా బాధ్యతలు స్వీకరించిన దివ్యను ఉద్యోగులు ,అధికారులు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో డీఆర్‌వో శివ శ్రీనివాస్, విజిలెన్స్ డీఎస్పీ బాలకిషన్, బీసీ సంక్షేమాధికారి వెంకటనర్సయ్య, డీఆర్‌డీఏ పీడీ ఎ.శ్రీనివాసనాయక్, ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి, సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వరప్రసాద్, డీఎస్వో గౌరీశంకర్, సివిల్ సప్లై డీఎం సాంబశివరావు, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కారుమంచి శ్రీనివాసరావు, సాంబశివరావు, బొగ్గారపు వెంకటేశ్వరరావు, తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ముజాహిద్ తదితరులు ఉన్నారు.




