Tuesday, 3 November 2026

జోనల్‌ విధానానికి గ్రీన్‌సిగ్నల్‌

– గెజిట్‌ జారీ చేసిన కేంద్ర హోంశాఖ
– ఫలించిన కేసీఆర్‌ దౌత్యం
– ఇక నుంచి 95శాతం ఉద్యోగాలు స్థానికులకే
హైదరాబాద్‌, ఆగస్టు30(జ‌నం సాక్షి) : తెలంగాణలో నూతన జోన్ల వ్యవస్థకు మోక్షం లభించింది. నూతన జోన్‌ల విధానానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థకు అంతకు ముందు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీంతో వెంటనే గురువారం కేంద్ర శాఖ గెజిట్‌ జారీ చేసింది.  కొత్త జోన్‌ల విధనాం ద్వారా స్థానికులకే 95శాతం ఉద్యోగాలవకాశాలు అందనున్నాయి. జోన్‌ల వ్యవస్థను ఆమోదించాలని కోరుతూ ఇటీలవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని, ఇతర కేంద్ర ¬ంశాఖ మంత్రిని కలిసి విన్నవించారు. నూతన జోన్‌ల విధానం ఆవశ్యకతను వివరించారు. ఈ క్రమంలో సంబంధిత పక్రియను చక్కబెట్టేందుకు ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ రెండు వారాలుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఎట్టకేలకు కొత్త జోనల్‌ వ్యవస్థకు, జిల్లాల పునర్వ్యవస్థీకరణకు రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ ఆమోదం వేయడంతో.. సంబంధిత ఉత్తర్వుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కూడా బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు సచివాలయంలోనే ఉన్నారు. కాగా గురువారం కొత్త జోన్‌లకు ఆమోదముద్ర వేస్తూ కేంద్ర ¬ంశాఖ గెజిట్‌ విడుదలచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయడంతో నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి.
స్థానికులకే 95శాతం ఉద్యోగాలు..
ఇప్పటి వరకూ అమల్లో ఉన్న విధానం ప్రకారం 70 శాతం పోస్టులను స్థానికులకు కేటాయించగా, 30 శాతం పోస్టులు ఓపెన్‌ కెటగిరీ పరిధిలోకి ఉంచేవారు. దీని వల్ల స్థానిక అభ్యర్థులు నష్టపోతున్నారనే భావనతో 95 శాతం పోస్టులను స్థానికులకు కల్పించేలా కేసీఆర్‌ సర్కారు నూతన జోన్ల విధానానికి రూపకల్పన చేసింది. గతంలో రాష్ట్రస్థాయి పోస్టులకు 50 శాతం లోకల్‌, మిగతా సగం ఓపెన్‌ కేటగిరీ ఉండేది. కానీ ఇక నుంచి ఈ పోస్టులను ప్రమోషన్ల ఆధారంగా స్థానికులతోనే భర్తీ చేయనున్నారు. జిల్లాస్థాయి పోస్టుల్లోనూ 95 శాతం స్థానికులకే అవకాశాలు దక్కనున్నాయి.
కొత్త జోనల్‌ విధానం ఇదీ..
– రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైతే ‘స్థానికత’ను వర్తింపజేస్తారో పోస్టుల ఎంపిక, నియామకాలు, విధుల నిర్వహణ కోసం ఆ ప్రాంతాన్ని ప్రత్యేక యూనిట్‌గా పరిగణిస్తారు.
– ఉన్నత పోస్టులకు లోకల్‌ కేడర్‌ నుంచి పదోన్నతుల కల్పనలో సమానావకాశాలు వర్తిస్తాయి. లోకల్‌ కేడర్‌ అధికారిని ఏ కార్యాలయానికైనా బదిలీ చేయొచ్చు. ఒక లోకల్‌ కేడర్‌లో ఉన్న ఉద్యోగిని ఇతర లోకల్‌ కేడర్‌కు బదిలీ చేయొచ్చు.
– జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టుల భర్తీ సందర్భంలో స్థానికులకే 95 శాతం మేర రిజర్వేషన్లను వర్తింపజేస్తారు. ఓపెన్‌ కేటగిరీ కింద 5 శాతం మాత్రమే ఉంటాయి.
– కటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు నాలుగేళ్ల పాటు చదివిన జిల్లానే ‘స్థానికత’గా పరిగణిస్తారు. ఇప్పటివరకు నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు వరుసగా నాలుగేళ్ళు చదివిన ప్రాంతాన్ని ‘స్థానికత’గా పరిగణిస్తున్నారు.
– ప్రభుత్వం నిర్దేశించిన మాదిరిగా ఏ కేటగిరీ పోస్టులకైనా కూడా ప్రతీ ప్రాంతానికీ ఒక లోకల్‌ కేడర్‌,
నియామకాల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు.
– అన్ని స్థానిక కేడర్లలోని ఉద్యోగులకు ఉన్నతస్థాయి పదోన్నతులకు సమాన అవకాశాలు.
– లోకల్‌ కేడర్‌ నుంచి ఇతర ఆఫీసులకు, సంస్థలకు ఒక ఉద్యోగిని బదిలీ చేయడానికి ఈ ఉత్తర్వు వర్తించదు. ఒక లోకల్‌ కేడర్‌ నుంచి మరో లోకల్‌ కేడర్‌కు బదిలీ జరగాలి.
– ప్రతీ బహుళ జోన్‌ ఒక లోకల్‌ ఏరియాగా ఉంటుంది. కొన్ని మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పోస్టులు వీటి పరిధిలో ఉంటాయి.
– ఉద్యోగాలలో స్థానికులకే సింహభాగం. కొత్త జిల్లాల ప్రాతిపదికన రానున్న రోజుల్లో జరగనున్న కొలువుల భర్తీలో అన్ని ప్రాంతాల వారికీ సమాన ప్రాతినిధ్యం లభిస్తుంది.
– గతంలో గ్రూప్‌ 1 స్థాయి పోస్టుల భర్తీ ఓపెన్‌ కేటగిరీలోనే జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతుంది. ఈ పోస్టుల్లో కూడా 95 శాతం స్థానికులకే అవకాశం లభిస్తుంది.
– ఇక కొత్త జోనల్‌ వ్యవస్థ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లో పనిచేసేందుకు అన్నిప్రాంతాల వారికీ మరింత విస్తృతమైన స్థాయిలో అవకాశాలు లభిస్తాయి.
– కొత్త వ్యవస్థ నేపథ్యంలో సచివాలయం, శాఖాధిపతుల ఆఫీసుల్లో పనిచేసేందుకు జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగుల నిష్పత్తి 25 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నాయి.
జోన్‌లు ఇవే……………
1. కాళేశ్వరం ( ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి – జనాభా 28,29,615)
2. బాసర (ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల – జనాభా 39, 74, 829)
3. రాజన్న (కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి – జనాభా 43, 09,866)
4. భద్రాద్రిలో కొత్తగూడెం( ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ – జనాభా 50, 44, 844)
5. యాదాద్రి (సూర్యాపేట, నల్గొండ, భువనగిరి యాదాద్రి, జనగాం – జనాభా 40, 23, 800)
6. చార్మినార్‌ (మేడ్చల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి – జనాభా 1,03, 57, 289)
7. జోగులాంబ (వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు ఉన్నాయి – జనాభా 44, 63, 431)
మల్టీ జోన్లు……..
1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రికొత్తగూడెం(జనాభా 1.61కోట్లు, విస్తీర్ణం 64,432)
2. యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబ (జనాభా 1.88కోట్లు, విస్తీర్ణం 47.419)