Wednesday, 4 November 2026

జోన్ల వ్యవస్థను స్వాగతిస్తున్నాం

ఆరు అనుకుంటే ఏడు జోన్లు పెట్టి ఆనందింప చేశారు

ఇదో మంచి నిర్ణయమన్న ఎన్జీవోలు

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి స్వాగతించారు. తాము ఆరు జోన్లు కావాలనుకున్నామని, కానీ సీఎం కేసీఆర్‌ ఇంకో జోన్‌ ఎక్కువే చేశారని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ టీజీవో భవన్‌ లో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం తర్వాత వారు విూడియాతో మాట్లాడారు.

జనగామ జిల్లాను యాదాద్రి జోన్‌ లో కాకుండా భద్రాద్రి జోన్‌ లో కలపాలని రవీందర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. వరంగల్‌ చారిత్రక నగరం కనుక భద్రాద్రి జోన్‌ ను భద్రాద్రి కాకతీయ జోన్‌ గా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించారు. అన్ని జిల్లాల ఉద్యోగులు సెక్రటేరియట్‌ లో పని చేసేలా అవకాశాలు కల్పించాలని కోరారు. తమపై కాంగ్రెస్‌ నాయకులు చేసే ఆరోపణలకు స్పందించం అని రవీందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాలు అందరం సంతోషంగా ఉన్నామని చెప్పారు. రాజకీయ నాయకులు రాజకీయాలు చూసుకోవాలని హితవు పలికారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాలో, ఎలా పరిష్కరించుకోవాలో తమకు తెలుసన్నారు. రాష్ట్రంలో ఏడు జోన్ల ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీజీవో అధ్యక్షురాలు మమత చెప్పారు. ఐతే, జోన్లలో కొన్ని మార్పులు కోరుతున్నామని చెప్పారు. వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌ లో కలపాలని ప్రభుత్వాన్ని మమత కోరారు. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన వారిని స్థానికులుగా గుర్తించాలని సూచించారు.

స్టేట్‌ క్యాడర్‌ లో ఉన్న పోస్టులు ప్రమోషన్‌ లో వచ్చేలా చూడాలని మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే, టీజీవో గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్‌ సూచించారు. పోలీస్‌ శాఖలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. 85:15 ప్రకారం రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు. ఉద్యోగ సంఘాలు కోరటంతోనే రాష్ట్ర ప్రభుత్వం మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, టీఎన్జీవో గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ స్పష్టం చేశారు. ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు రావటం కోసమే మల్టీ జోన్లు కోరామన్నారు.