.జనవరి నెలలో బొగ్గు రవాణా లో సింగరేణి ఆల్‌టైం రికార్డు……
మరో ఆల్ టైం రికార్డుగా ఓవర్ బర్డెన్ తొలగింపు…..
ఒక్క నెలలోనే 68.4 లక్షల టన్నుల బొగ్గు రవాణా…..
జనవరి 31 వ తేదీన రికార్డు స్థాయిలో 16.67 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత…..
సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్. శ్రీధర్ అభినందన…..
ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుకుంటున్న తరుణంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి ప్రక్రియలో దూకుడుగా ముందుకుపోతూ పలు ఆల్ టైం రికార్డులను సృష్టిస్తోంది. జనవరి నెలలో సింగరేణి చరిత్రలోనే ఆల్ టైం రికార్డుగా 68.4 లక్షల టన్నుల బొగ్గు ను రవాణా చేసింది. గతంలో 2016 సంవత్సరం మార్చి నెలలో చేసిన 64.7 లక్షల టన్నుల బొగ్గు రవాణాయే ఇప్పటి వరకు గరిష్ట రికార్డుగా నమోదై ఉంది. జనవరి నెలలో మొత్తం 11 ఏరియాల నుంచి సగటున రోజుకు 39 రైలు బండ్ల చొప్పున మొత్తం 1216 రేకుల ద్వారా బొగ్గు రవాణా జరిపారు. ప్రధానంగా తెలంగాణ జెన్ కో తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎక్కువ శాతం బొగ్గు రవాణా జరిగింది. ఈ ఏడాదిలో డిసెంబరులో గరిష్టంగా 1186 రేకుల ద్వారా జరిపిన బొగ్గు రవాణా ను జనవరి నెలలో సింగరేణి అధిగమించింది.సింగరేణి చరిత్రలో ఆల్ టైం రికార్డుగా ఓవర్ బర్డెన్ తొలగింపు…బొగ్గు రవాణా తోపాటు ఓపెన్ కాస్టు గనుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపులో కూడా సింగరేణి కొత్త రికార్డు సాధించింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా మంగళవారం (31.01.2023) ఉదయం షిఫ్టు మొదలుకొని రాత్రి షిఫ్టు వరకు అత్యధికంగా 16.67 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించి రికార్డు సృష్టించింది. గత నెల జనవరి 30వ తేదీ(సోమవారం)న సాధించిన 15.75 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ ఇప్పటి వరకు గరిష్ట రికార్డుగా నమోదై ఉంది.. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 18 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే దానిపై ఉన్న మట్టిని (ఓవర్ బర్డెన్) తొలగించాల్సి ఉంటుంది. ఇందుకోసం కంపెనీ యంత్రాలతోపాటు ఆఫ్ లోడింగ్ యంత్రాల సహాయంతో ఓబీని తొలగిస్తుంటారు. మంగళవారం ఆఫ్ లోడింగ్ ద్వారా 14.83 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను, డిపార్ట్ మెంటల్ యంత్రాల సహాయంతో 1.84 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించడంతో ఈ కొత్త రికార్డు నెలకొల్పారు.
జనవరి నెలలో నిర్దేశిత లక్ష్యాల సాధనలో ముందుకుపోతున్న నేపథ్యంలో పలు ఆల్‌టైం రికార్డులను సాధించడం పట్ల సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ సంతోషం వ్యక్తం చేస్తూ.. కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి తన అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మిగిలి ఉన్న 60 రోజుల్లో అన్ని ఏరియాలు తమకు కేటాయించిన లక్ష్యాలను రోజువారీగా సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకువెళ్తే నిర్దేశిత 700 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని దాటగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
-జనం సాక్షి – హైదరాబాద్




