హైదరాబాద్,మే17(జనం సాక్షి ): టిటిడి తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే సుప్రీంలో పోరాడుతామన్న ప్రధానార్చకులు రమణదీక్షితులు టిటిడి నిర్ణయాన్ని తప్పుపట్టారు. 65 ఏళ్లపై బడిన వారు రిటైర్మెంట్ అవ్వాల్సిందేనని టిటిడి నిర్ణయం తీసుకుంది. టిటిడి నిర్ణయంతో ఐదుగురు మిరాశి అర్చకులు ఉద్యోగం కోల్పోనున్నారు. ఒక సన్నిధి గొల్ల, 10 మంది మిరాశీయేతర అర్చకులు, రమణ దీక్షితులకు ఇఒ నోటీసులు జారీ చేసింది. తమపై చర్యలు తీసుకునే అధికారం టిటిడికి లేదని రమణ దీక్షితులు తెలిపారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ…. 143 చట్టం ప్రకారం తమకు మిరాశిలో వచ్చే ఆదాయం మాత్రమే రద్దయిందని స్పష్టం చేశారు. వంశపారంపర్యం, సంభావన, గౌరవంగా చూడాలని సుప్రీం తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు నిర్ణయాలనూ టిటిడి పెద్దలు లెక్కచేయడం లేదని మండిపడ్డారు. మిరాశి అర్చకులను హీనంగా చూసినా సహించామని, కానీ కైంకర్యాలలో లోపాలు జరిగితే ఊరుకోమన్నారు. విఐపిల సేవలో టిటిడి తరిస్తూ తమపై పెత్తనం చెలాయిస్తోందని, నిత్యసేవలు త్వరగా నిర్వహించాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని రమణ దీక్షతులు ఆరోపణలు చేశారు.




