హైదరాబాద్,అక్టోబర్20(జనంసాక్షి ): పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ ఖండించారు. గతంలోనే టిఆర్‌ఎస్‌లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయన టిడిపిలోనే కొనసాగుతున్నారు. తాజాగా మరోమారు అలాంటి ప్రచారమే సాగింది. అయితే తాను టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబే తమ నేతని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని శ్రీనివాస్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీపీ బలంగా ఉందని, కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గ్రేటర్ నేతలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టిడిపి తనకు రాజకీయ జన్మనిచ్చిందని అన్నారు. పార్టీని నగరంలో పటిష్టం చేయడమే తనముందున్న కర్తవ్యమని అన్నారు.




