హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో రెండవ రోజు కూడా రైతు సమస్యలపై చర్చ జరిగింది. అధికార పార్టీ తీరుపై… ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ అసమర్థ పాలనతోనే… రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అన్నదాతల్ని ఆదుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనమండలిలోనూ రైతు, ప్రజా సమస్యలపై వాడీవేడీ చర్చ జరిగింది. బుధవారం సభ ప్రారంభంకాగానే కాంగ్రెస్ సభ్యులు… వరంగల్ ఎన్‌కౌంటర్ ఘటనపై న్యాయ విచారణ జరపాలని పట్టుబట్టారు. వామపక్ష నేతలు, కార్యకర్తల అరెస్టులపై చర్చించాలంటూ పట్టుబట్టారు. దీంతో సభలో కొంత గందరగోళం నెలకొంది.
రైతుల సమస్యలపై చర్చించిన తరువాత వరంగల్ ఘటనపై పరిశీలిద్దామని మండలి ఛైర్మన్ చెప్పడంతో సభ్యులు వెనక్కితగ్గారు. అనంతరం రైతు సమస్యలపైనే సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. అప్పుల బాధలు తాళలేక, రైతులు ఆత్మహత్యలు చేసుకోక ముందే వారిని అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి డిమాండ్ చేశారు. రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న కేసీఆర్ సర్కార్‌పై మరో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ ఫైర్ అయ్యారు. “ఎద్దు ఏడ్చిన చోట ఎవుసం సాగదు. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదని” చెప్పిన కేసీఆర్ పాలనలోనే ఇప్పుడు రైతులు ఏడుస్తున్నారని ఆయన అన్నారు. రైతుల కోసం ఎస్ఎల్ బిసి సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్‌కు తీరిక లేదా..? అని ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ మండలిలో రైతు సమస్యలపై 14 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తే కొంత ఉపశమనం కలుగుతుందని అధికార పార్టీ సభ్యులు సమాధానమిచ్చారు




