Thursday, 5 November 2026

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై యుద్ధం చేస్తాం

జనచైతన్య యాత్రతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగతాం
కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు
ఎస్సీలకిచ్చిన హావిూ కేసీఆర్‌ విస్మరించారు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌
ప్రారంభమైన జనచైతన్య రథం యాత్ర
హైదరాబాద్‌, జూన్‌23(జ‌నం సాక్షి) : జనచైతన్య యాత్రతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. శనివారం జనచైతన్య యాత్ర ప్రారంభం సందర్భంగా బషీర్‌బాగ్‌ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాత్రతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, కుటుంబ పాలనకు శుభం పలుకుతామని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని, పథకాలను కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌, మజ్లీస్‌ పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని, ఈ ముఠాకు కాంగ్రెస్‌ నాయకత్వ వహిస్తోందని వెల్లడించారు.  టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందన్న సంగతిని నిరూపించుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నాయని, కాళ్లు మాత్రం తంగెళ్లు దాటడం లేదన్నారు. నాలుగేళ్లుగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ‘రైతుబంధు’ లాంటి తాయిలాలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. ముస్లింలను బీసీ(ఈ)లో చేర్చి కాంగ్రెస్‌ మోసం చేసిందని, బీసీ కమిషన్‌ కూడా ఏర్పాటు కాకుండా అడ్డుకుందన్నారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలను దగా చేయడానికి టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని వెల్లడించారు. బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తే.. రాష్ట్రంలో అగ్గి రగులుకుంటుందని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ(ఈ) కోటాలో ముస్లింలకు అవకాశం కల్పిస్తే.. ఊరుకోమన్నారు. కేసీఆర్‌ వైఖరితో రగిలిపోతున్న బలహీనవర్గాల ప్రజలు అదునుకోసం చూస్తున్నారన్నారు. కేసీఆర్‌లో నిజాంను మించిన నియంతృత్వం, కాంగ్రెస్‌ను మించిన కుటుంబ పాలన, గోబెల్స్‌ను మించిన ప్రచారం చేసే లక్షణాలున్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్న కేసీఆర్‌, ఇటీవల ఢిల్లీలో కలిసినప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. తాము యాత్రలో వెల్లడించే అంశాలపై  చర్చించడానికి టీఆర్‌ఎస్‌ సిద్ధమా..? అని ఆయన సవాల్‌ విసిరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆ ఎన్నికల్లో కచ్చితంగా గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చేది దగా
పడిన వారికి న్యాయం చేయడం కోసమేనని ప్రకటించారు. అనంతరం జనచైతన్య రథం యాదాద్రికి బయలుదేరింది. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత  లక్ష్మణ్‌ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ సభలో బీజేపీ నేతలు కిషన్‌ రెడ్డి, బండారు దత్తాత్రేయ, ఎన్వీఎస్సెస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్సీ రాం చందర్‌ ఇతర పార్టీ నాయకులు పాల్గొంటారు.