– బదిలీ ప్రక్రియను నిలిపివేయాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం
– దాఖలైన 125 పిటీషన్లను కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్, జులై2(జనం సాక్షి) : తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్ అయింది. ఉపాధ్యాయ బదిలీ నిబంధనలను సవాల్ చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగియడంతో హైకోర్టు సోమవారం తుది తీర్పును వెల్లడించింది. టీచర్ల బదిలీ పక్రియ నిలిపి వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. బదిలీలు ఆపాలంటూ హైకోర్టులో దాఖలైన 125 పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. మరోవైపు.. బదిలీ ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని, ఏకీకృత సర్వీసు నిబంధనలకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ఉత్తర్వుల్ని యథాతథంగా ఉంచాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో బదిలీ ఉత్తర్వుల్ని రద్దు చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల తరఫున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, జెడ్పీ టీచర్ల తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదించిన విషయం తెలిసిందే. డీఈవో లేని చోట్ల ఉపాధ్యాయులను బదిలీచేసే అధికారం ఆర్‌జేడీలకు అప్పగించామని, పూర్వపు పది జిల్లాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బదిలీలు జరుగుతాయని, పైరవీలకు ఆస్కారం లేదనే కొందరు కావాలని బదిలీ పక్రియను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని, ఈ వ్యాజ్యాలను కొట్టివేసి బదిలీలు జరిగేలా చేయాలని సర్కార్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు ప్రతివాదన చేశారు. గతంలో పలు దఫాలు వాయిదా పడగా.. బదిలీలు ఆపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను సోమవారం కొట్టివేసిన ధర్మాసనం పక్రియను కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది.
—————————-




