Wednesday, 4 November 2026

టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌21 (జనం సాక్షి)  : జిల్లా పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డిఇవో సూచించారు. ప్రతీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నామన్నారు. ఆ సమయంలో ప్రార్థనా సమయానికి అందరూ హాజరు కావాలని సూచించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చి వంద శాతం గ్రేడ్‌ సాధించే విధంగా ముందుకెళ్లాలని సూచించారు. జిల్లాకు నిరుడు 85 శాతం ఉత్తీర్ణత వచ్చిందని గుర్తుచేశారు. ఈ సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషిచేయాలని హెచ్‌ఎంలకు సూచించారు. 50 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో సమావేశాలు నిర్వహించాలని, తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇచ్చి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని హెచ్‌ఎంలకు సూచించారు. పదో తరగతి విద్యార్థులపైనే కాకుండా ఆరో తరగతి నుంచే ఒక ప్రణాళికా బద్ధంగా విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధులను చేస్తే దాని ప్రభావం పదో తరగతిపై కచ్చితంగా చూపుతుందన్నారు.