హైదరాబాద్,మే8(జనం సాక్షి): 2018-19 విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాల ఆన్‌లైన్ పక్రియకు సంబంధించిన దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10వ తేదీ నుంచి 26 వరకు విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. రూ.400 ఆలస్య రుసుముతో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. దోస్త్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకునేటప్పుడు కాలేజీలు, కోర్సుల ఆప్షన్లు ఇవ్వాలని పాపిరెడ్డి సూచించారు. ఈ నెల 28,29,30 తేదీల్లో సర్టిఫిరెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. జూన్ 4 వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయిస్తామని, జూన్ 5 నుండి12 వరకు విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని చెప్పారు. జూన్ 19న సెకండ్ లిస్ట్, జూన్ 30న థర్డ్ లిస్ట్ పెడతామన్నారు. జూలై 1 నుండి తరగతులు ప్రారంభిస్తామన్నారు.
దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లపై కాలేజీ, జిల్లా, యూనివర్సిటి స్థాయిల్లో అవగాహన కల్పించామని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో అడ్మిషన్స్ చేయడం విద్యార్థులకు సులభం అవుతుందన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల పేపర్ లో కూడా దోస్త్ నిబంధనలు తెలియజేశామని గుర్తుచేశారు. గ్రూప్, ఆప్షన్ ఎంపిక విద్యార్థులకు చాలా సులభంగా ఉంచామన్నారు.




