ఫోరైడ్ బాధితుడికి ఆర్థిక అండ
హైదరాబాద్,మే8(జనం సాక్షి): మంత్రి కేటీఆర్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామికి అండగా నిలిచారు. కొన్ని రోజుల కింద మంత్రి కేటీఆర్ ను కలిసి అంశల స్వామి.. ఫ్లోరైడ్ బారిన పడి జీవశ్ఛవంలా మారానని, ఆదుకోవాలని కోరాడు. వెంటనే స్పందించిన కేటీఆర్, స్వామికి అన్ని విధాల అండగా ఉండాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ను కోరారు. ఈ మేరకు స్వామి కలెక్టర్ ఉప్పల్ ను కలెక్టరేట్ లో కలిశాడు. స్వామి శివన్నగూడెంలో ఇల్లు కట్టుకోవడానికి కావల్సిన ఆర్ధిక సాయం సుమారు 6 లక్షలు అందజేస్తామని కలెక్టర్ చెప్పారు. తన కులవృత్తి అయిన క్షౌరశాల (సెలూన్) ఏర్పాటుకు మరో రెండు లక్షలు కలెక్టర్ ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేశారు. మంత్రి కేటీఆర్ కు, జిల్లా కలెక్టర్ గౌరవ్ కు ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామి ధన్యవాదాలు తెలిపాడు.
–




