హైదరాబాద్, : అంబేద్కర్ విదేశీ విద్యానిధి కింద విదేశాల్లో ఎస్సీ విద్యార్థులు చదువుకునేందుకు డిసెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడనుందని తెలంగాణ ఎస్సీ డెవల్‌పమెంట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. ఇందుకు గానూ ఎస్సీ విద్యార్థులకు స్కిల్ అప్‌గ్రేడేషన్ కింద జీఆర్‌ఈ, టోఫెల్, ఐఎల్‌టీఈఎస్, జీమ్యాట్‌లో శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎస్సీ సంక్షేమ అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఎనిమిది మంది ఎస్సీ న్యాయవాదులకు ఆర్థిక సహాయంచేసే అవకాశం ఉండగా, కేవలం నాలుగు జిల్లాలు మాత్రమే ప్రతిపాదనలు పంపాయన్నారు. 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే ఎస్సీ కుటుంబాలను గుర్తించి, వారికి ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయాలని నిర్దేశించారు. ఉద్యోగ నియామకాలు వెలువడుతున్నందున ఎస్సీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్‌ను ప్రారంభించాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లింపులు సత్వరం చేపట్టాలని, ఎస్సీ సబ్‌ప్లాన్‌పై మానిటరింగ్ కమిటీలు ఏర్పాటుచేయాలన్నారు.




