హైదరాబాద్ సిటీ : గ్రేటర్ పరిధిలో ప్రయాణికులకు మరిన్ని సేవలందించేందుకు ఆర్టీసీ కొత్త రూట్‌ను ఎంపిక చేసింది. క్షేత్ర స్థాయిలోనూ అధ్యయనం చేసిన ఆర్టీసీ అధికారులు కొత్త మార్గాన్ని ఎంపిక చేసి 15 నుంచి ఈ మార్గంలో బస్సులను నడపనున్నారు. లాల్‌బజార్ నుంచి పటాన్‌చెరు (రూట్‌నం.219 ఎల్/పీ) మార్గంలో 6 బస్సులను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అల్వాల్‌లోని లాల్‌బజార్‌లో ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మొదటి బస్సు సుచిత్ర, బోయిన్‌పల్లి, కేపీహెచ్‌బీకాలనీ, మియాపూర్ మీదుగా పటాన్‌చెరు చేరుకుంటుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.పురుషోత్తం తెలిపారు. ప్రతి 31 నిమిషాలకు రెండు వైపుల నుంచి బస్సులు బయలుదేరుతాయని, మొత్తం 24 ట్రిప్పులు ప్రతిరోజు తిరుగుతాయని తెలిపారు. పటాన్‌చెరులో మొదటి బస్సు ఉదయం 7.33 నిమిషాలకు, రాత్రి 8.40 నిమిషాలకు చివరి బస్సు బయలు దేరుతుంది. అదేవిధంగా లాల్‌బజార్‌లో మొదటి బస్సు 6 గంటలకు, చివరి బస్సు రాత్రి 7 గంటలకు బయలు దేరుతుంది. ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గ్రేటర్ పరిధిలో ఎప్పటికప్పుడు కొత్త రూట్లలో బస్సులను నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.




