హైదరాబాద్,ఆగస్ట్3(జనం సాక్షి): మూడురోజలు ఢిల్లీ పర్యటనలకు సిఎం కెసిఆర్ శుక్రవారం బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి కెసిఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి సత్వరం ఆమోదం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులతో సిఎం భేటీ కానున్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ఆవశ్యకత, దీని ద్వారా రాష్ట్ర యువతకు లభించనున్న ఉద్యోగ అవకాశాలు, సత్వరం దీన్ని కేంద్రం ఆమోదించాల్సిన అనివార్యత తదితరాలపై సిఎం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభు త్వ పెద్దలకు వివరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జోనల్ విధానానికి ఆమోదం పొందడం పర్యటన ప్రధాన ఉద్దేశం. గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్ల పెంపు, ఉమ్మడి హైకోర్టు విభజన సహా కేంద్రం ఇచ్చిన ఇతర హావిూలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేక ¬దా వంటి అంశాలపైనా ఆయన వారితో చర్చించనున్నారు. స్థానికులకు విద్య, ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ విధానాన్ని రూపొందించింది. దానిపై చట్టం చేసి శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి ఆమోదం కోసం పంపింది. గత నెలలో సీఎం కేసీఆర్ ప్రధానిని, కేంద్ర ¬ం మంత్రి రాజ్నాథ్సింగ్లను కలిసి దీనిని ఆమోదించాలని అభ్యర్థించారు. కేంద్ర న్యాయ, ¬ం శాఖలు స్పందించి దస్త్రాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట వేయడానికి ప్రస్తుతం జోనల్ విధానం అవరోధంగా ఉందని సీఎం భావించి, సమూల మార్పులు చేపట్టారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో యువతకు ఎక్కడికక్కడే ఉద్యోగాలు లభించేలా 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో చట్టం రూపొందించారు. కొత్త విధానాన్ని కేంద్రం ఆమోదిస్తే దాని ప్రకారమే ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నారు. అందుకే తానే ప్రధానిని కలిసి కొత్త జోనల్ వ్యవస్థ ఆవశ్యకతను వివరించి, ఆమోదం పొందే వరకు అక్కడే ఉండి పర్యవేక్షించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రధానిని కలవడానికి ఆయన కార్యాలయం సీఎంకు సమయం ఇచ్చింది.అక్కడే ఉన్న ఎంపిలతో కలసి ఆయన ప్రధానిని,మంత్రులను కలుస్తారు.




