Friday, 6 November 2026

తగ్గని ఎండల తీవ్రత

                                                                               ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఉత్తర తెలంగాలో ఎండలు మండుతున్నాయి. ఎండల కారణంగా ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం అయ్యిందంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.  మరో రెండు మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు. అటు శ్రీలంక, ఆగ్నేయ బంగాళాఖాతం విూదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, గద్వాల, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇకపోతే  సోమవారం జగిత్యాల జిల్లాలో 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌ నగరంలో సైతం ఎండల తీవ్రత కొనసాగుతోంది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్‌ 11 నుంచి19 తేదీల్లో ఉత్తర తెలంగాణను తాకుతాయని ఇండో జర్మన్‌ వాతావరణ పరిశోధనా ప్రాజెక్టు అంచనా వేస్తోంది. రుతుపవనాల రాకను  ముందుగానే అంచనా వేస్తున్నారు. దీంతో ఖచ్చితమైన వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం కలుగుతుందని ప్రాజెక్టు ఛైర్మన్‌ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ తెలిపారు. గత రెండేండ్లుగా ఈ ప్రాజెక్టు కచ్చితంగా అంచనాలు వేసినట్టు ఆయన తెలిపారు.