Monday, 2 November 2026

తల్లి కొనిచ్చిన కారులోనే అనంత‌లోకాల‌కు….

హైదరాబాద్: ఆ తల్లి భయపడినట్టుగానే జరిగింది. తన కుమారుడికి ఏదైతే జరగకూడదని ఆ తల్లి కోరుకుందే అదే జరిగింది. తాను కొనిచ్చిన కారు కన్నబిడ్డ పాలిట మృత్యుశకటంగా మారింది. బంజారాహిల్స్ లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వరూప్ నగర్ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ పట్టభద్రులు మామిడాల తేజ(23), పల్లె శరత్ చంద్ర గౌడ్(23), తిరునహరి నరేన్ సాయి ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదానికి కారణమైన హొండా సిటీ కారు తేజకు తల్లి బహుమానంగా ఇచ్చింది. టూవీలర్స్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని భావించిన ఆమె తన కుమారుడికి కారు కొనిచ్చింది. అమ్మ తనకు ఇచ్చిన బహుమతి గురించి తేజ ఫేస్ బుక్ లో తన మిత్రులతో పంచుకున్నాడు. కారు ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అయితే తన తల్లి కొనిచ్చిన కారులోనే అతడు ప్రమాదానికి గురవడం విషాదం. విదేశాల్లో ఎంఎస్ చేయడానికి వెళతాడనుకున్న కొడుకు హఠాన్మరణం పాలవడంతో తేజ తల్లి అరుణ శోకసంద్రంలో మునిగిపోయారు.

ఒక్కగానొక్క కుమారుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో నరేన్ సాయి తండ్రి రామస్వామి తల్లడిల్లుతున్నారు. గత సివిల్స్ పరీక్షలో ఒక్క మార్కుతో ర్యాంక్ కోల్పోయిన నరేన్… మళ్లీ అదే పట్టుదలతో పయత్నిస్తున్నాడు. కుమారుడి అకాల మరణంతో రామస్వామి దంపతులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు.

మరో మృతుడు శరత్ చంద్ర ఎస్ఐ సెలక్షన్స్ కు, గ్రూప్స్ కు ప్రిపేరవుతున్నాడు. ఇంతలోనే ప్రమాదం బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ముగ్గురు యువకుల మరణంతో ఫ్రెండ్స్ కాలనీలో విషాదం అలుముకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *