క్షేత్రస్థాయిలో పంపిణీ చూసుకునేలా చర్యలు
హైదరాబాద్,జూన్28(జనం సాక్షి): డీలర్ల సమ్మె కారణంగా లబ్ధిదారులకు ఎ లాంటి ఇబ్బందులు రాకుండా నిత్యావసర వస్తువుల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. తహసిల్దార్లకు అధికారాలు అప్పగించారు. ఇక వారి పర్యవేక్షణలో నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగనుంది. డీలర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో జిల్లాల్లోని చౌకధర దుకాణాల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర వస్తువులను ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పంపణీ చేసేందుకు తహసీల్దార్లు, ఐకేపీ, మెప్మా, జీసీసీ సిబ్బందికి ఆదేవాలు ఇచ్చారు. నిరుపేదలకు అందే నిత్యావసర వస్తువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత తహసీల్దార్లదేనన్నారు. మండలంలో ప్రతీ చౌకధర దుకాణం పరిధిలో ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ కేంద్రాలు, గ్రామ పంచాయతీలుగా పంపిణీకి అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేసే వారి డీడీతో పాటుగా ఆధార్ నంబర్ తప్పక తీసుకోవాలన్నారు. సరుకుల పంపిణీ కోసం ఆథరైజేషన్ ఇచ్చిన వారే విక్రయించాలని, మరొకరు విక్రయించరాదన్నారు. డీలర్లకు కూడా అవకాశమివ్వాలని, వారు రాకపోతే డీలర్షిప్పులు రద్దు ఉత్తర్వులు అందజేయాలని సూచించారు. వేయింగ్ మిషన్ల కోసం తహసీల్దార్లకు సూచనలిచ్చారు. నిత్యావసర వస్తువులు ఒకేచోట నిల్వ చేయరాదని, అవసరానికి మించి ఉన్న సరుకులను మరొక చోటకు తరలించాలన్నారు. వర్షాకాలం అయినందున నిత్యావసర వస్తువుల దిగుమతిలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ షాపులు నిర్వహించవద్దన్నారు. నిర్వహణలో డీలర్ల సలహాలు గానీ, సూచనలు గానీ తీసుకోవద్దని సూచించారు. తహసీల్దార్లు స్వయంగా సంబంధిత సిబ్బందితో ఆయా ప్రాంతాలను సందర్శించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసర వస్తువులను సందర్శించాలన్నారు. పకడ్బందీగా నిర్వహణ చేపట్టి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.




