– వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తుంది
– నిరుద్యోగుల పట్ల కేసీఆర్ వైఖరి సరిగాలేదు
– రాష్ట్రంలో తెరాసకు బీజేపీనే ప్రత్యామ్నాయం
– విలేకరులసమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్, నవంబర్30(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలు, కుటుంబ పాలన, అవినీతి ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. సూర్యాపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో సుమారు 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడితే ఆ రంగాన్ని ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సమితులు అని ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటిల్లో కేవలం తెరాస కార్యకర్తలకే ప్రాధాన్యతనివ్వటంతో అవి పార్టీ కమిటీలుగా మారాయని
విమర్శించారు. రైతుల కమిటీల్లో పార్టీ కార్యకర్తలను పెడితే రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. కేవలం మాటల్లోనే కేసీఆర్ రైతులను రాజులుగా చేస్తున్నారని.. ఆచరణలో మాత్రం రైతులు బికారులుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన వారు ప్రస్తుతం తెరాస ప్రభుత్వం తీరుతో ఉద్యోగాలు రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి సరిగా లేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేసేంత వరకు భాజపా, బీజేవైఎం పోరాడతాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా మాత్రమేనని పేర్కొన్నారు. కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. గుజరాత్ ఎన్నికలు రాహుల్‌గాంధీకి చెంపపెట్టు కానున్నాయని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.




