Tuesday, 3 November 2026

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్ధృతం

హైదరాబాద్‌: వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన ఉద్ధృతం చేశారు. డిమాండ్ల సాధనకోసం బస్‌ భవన్‌ ముట్టడించాలని నిర్ణయించారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఆర్టీసీ కార్మికులు సుందరయ్య భవన్‌ నుంచి బస్‌భవన్‌కు భారీ ర్యాలీ చేపట్టారు. ఆందోళనకు గుర్తింపు కార్మిక సంఘాలు ఎంప్లాయిస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళనలో పాల్గొనడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 90శాతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
హైదరాబాద్‌లో ప్రయాణికుల ఇక్కట్లు
ఆర్టీసీ కార్మికుల ఆందోళన కారణంగా జంటనగరాల్లో బస్సు సర్వీసులు దాదాపుగా నిలిచిపోయాయి. ప్రధాన కూడళ్లకు మాత్రమే స్వల్పంగా బస్సులు తిరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు బస్సులు లేకపోవడంతో గంటల తరబడి బస్టాప్‌లలో వేచి చూడాల్సి వస్తోంది. పదోతరగతి పరీక్షల కోసం బయలుదేరిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *