హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో 460 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారుల నిర్మాణాల కోసం రూ.8000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. తెలంగాణ రాష్ర్టానికి కోరినవన్నీ ఇచ్చామని, ఇప్పటివరకు 2,651 కి.మీ. జాతీయ రహదారులను మం జూరు చేశామని చెప్పారు. ప్రతిపాదిత రహదారులకు త్వరగా సవివర ప్రాజెక్టు రిపోర్టులు (డీపీఆర్) పంపిస్తే నిధులందజేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శనివారం హైటెక్స్‌లో 77వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు మెగా ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 96 వేల కిలోమీటర్లున్న జాతీయ రహదారులను రెండు లక్షల కిలోమీటర్లకు విస్తరిస్తామని ప్రకటించారు. జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం కనిపించాలని, కాలుష్యరహితంగా రహదారులుండాలని అన్నారు.
తెలంగాణలో కొత్తగా మంజూరైన 460 కిలోమీటర్ల జాతీయ రహదారులకు రూ.8 వేల కోట్లు ఇస్తామని, ఇందులో మంచిర్యాల- చంద్రాపూర్ రోడ్డుకు రూ.1500 కోట్లు, సూర్యాపేట- ఖమ్మం రోడ్డుకు రూ.900 కోట్లు, సంగారెడ్డి- నాందేడ్ రోడ్డుకు 2,300 కోట్లు, జగిత్యాల- కరీంనగర్- వరంగల్ రోడ్డుకు రూ.250 కోట్లు, కోదాడ- ఖమ్మం రోడ్డుకు రూ.700 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే రహదారులు బాగుండాలని కేంద్ర మంత్రి అన్నారు. దేశంలో ప్రమాదరహిత రహదారుల నిర్మాణాల కోసం నూతన విధానాలు అవలంబించాలని సూచించారు. ప్రతీ ఏడాది రోడ్డు ప్రమాదాల వల్ల 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, 2.50 లక్షల మంది వికలాంగులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి? నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు ఎలా ఉండాలనేదానిపై కొత్తగా ఆలోచించాలని ఐఆర్సీ ప్రతినిధులకు సూచించారు. నిర్మాణరంగంలో ఉన్న కాంట్రాక్టర్లు తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని, జనహితంతో నిర్మాణాలు చేపట్టాలని మంత్రి కోరారు.
రహదారుల నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్లు పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చి మొత్తం వ్యయంలో 1 శాతం నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. రహదారుల నిర్మాణాలకు తయారుచేసే డీపీఆర్లు నిర్మాణాత్మకంగా ఉండాలని, రహదారి భద్రత చర్యలను విధిగా పొందుపరుచాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రతీ రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేవిధంగా ఐఆర్సీ సదస్సు ఫలితాలుండాలని కోరారు. రహదారులకు వంతెనలు (బ్రిడ్జి కం చెక్‌డ్యాం) నిర్మించే క్రమంలో భూగర్భజాలలను పెంచాలని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకుసాగితే త్వరగా పనులు చేపట్టే అవకాశముంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ బాధ్యతను చూస్తున్నాయన్నారు.
తెలంగాణలో ఎన్‌హెచ్‌లకు 8వేల కోట్లు




