Wednesday, 4 November 2026

సిటీ దాటాల్సిందే ఇక!

ghmc-ogo_0రాజధానిలోని జీహెచ్‌ఎంసీ సహా వివిధ విభాగాల్లో తిష్ఠవేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులు, దశాబ్దాలుగా నగరంలోనే తిష్ఠవేసిన అధికారులు ఇకపై సిటీ దాటి ఇతర జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నది. అర్హతలు ఉండీ జిల్లాల్లో పనిచేస్తున్న వారు నగరానికి రావచ్చు. ఏకీకృత సేవా నిబంధనల ప్రతిపాదనకు అసెంబ్లీ ఆమోదం లభిస్తే ఈ వెసులుబాటు కలుగుతుంది.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రస్తుత చట్టాల ప్రకారం నగరంలోని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌బోరు, కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) తదితర విభాగాల ఉద్యోగులను గ్రేటర్ బయటకు బదిలీచేసే అవకాశం లేదు. దీంతో పలువురు అధికారులు, ఉద్యోగులు నగరంలో తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జీహెచ్‌ఎంసీని వీడేందుకు ఎవ్వరూ ఒప్పుకోని పరిస్థితి. డిప్యుటేషన్‌పై వచ్చిన వారు సైతం పైరవీలు చేసి మరీ ఇక్కడే కొనసాగుతున్నారు. ఇతర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో ప్రభుత్వం యూనిఫైడ్ సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలుపగా శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఆమోదిస్తే పైన పేర్కొన్న విభాగాల్లోని ఉద్యోగులు, అధికారులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు బదిలీచేసే అవకాశం కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *