Monday, 2 November 2026

తెలంగాణలో ఎమ్మెల్సీలపై ఎదురుచూపు

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాతనే నిర్ణయం?

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణలో అధికారపార్టీ నేతలను 4 నెలలుగా మూడు పదవులు ఊరిస్తున్నాయి. అవి ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు. అదిగో ఇదిగో అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అనేకమంది పేర్లు చర్చలోకి వచ్చాయి. అయితే దుబ్బాక ఉప ఎన్నిక ముగిసాకనే దీనిపై సిఎం కెసిఆర్‌ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ దృష్టి అంతా దుబ్బాక ఉప ఎన్నికపై ఉంది. ఇదే సమయంలో గ్రేటర్‌ ఎన్నికపైనా కన్నేసింది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపైనా గులాబీ అధినేత ఫోకస్‌ పెట్టారు. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై ప్రకటన ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ శాసనమండలిలో గవర్నర్‌ కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆగస్టు నెల నుంచే వీటిపై టీఆర్‌ఎస్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. నాయిని నర్సింహారెడ్డి బతికుండగానే మరోమారు ఆయనకు ఛాన్స్‌ ఇస్తారన్న ప్రచారం కూడా సాగింది. కొందరు నేరుగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఎమ్మెల్సీని చేయాలని కోరారు. మరికొందరు కేటీఆర్‌ను కలిసి తమ మనసులో మాట వెల్లడించారు. అయితే ఎవరికి ఛాన్స్‌ ఇస్తున్నారన్న విషయంలో పార్టీ అధిష్ఠానం ఎక్కడా బయటపడలేదు. దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసిన కర్నె ప్రభాకర్‌, గోరటి వెంకన్నల పేర్లు అదే పనిగా ప్రచారంలో ఉన్నాయి. ఈ ముగ్గురిలో దేశపతి, గోరటి పేర్లు బలంగానే వినిపిస్తున్నా.. మరోసారి ఛాన్స్‌ ఇవ్వాలని కర్నె కోరుతున్నట్లు సమాచారం. అధినేతల ప్రసన్నం కోసం ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కర్నెకు ప్రభుత్వ విప్‌గా కూడా అవకాశం ఇచ్చారు. అయితే మళ్లీ ఆయన్ని ఎమ్మెల్సీని చేస్తారా లేదా అన్నది అధినేత నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. పార్టీలోని మరో వర్గం మాత్రం కర్నెకు అధిష్ఠానం నుంచి హావిూ దక్కిందనే ప్రచారం మొదలుపెట్టింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చి ఉన్నారు. అలా హావిూలు పొందిన వారిలో ఎవరిని ఎంపిక చేస్తారో.. ఎవరికి పిలుపు వస్తుందో అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఈ మూడు సీట్ల విషయంలో టీఆర్‌ఎస్‌ అధినేత వడపోతలేంటనేదీ ఉత్కంఠగా మారినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్నవారు కాకుండా కొత్తవారిని ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారం ఉంది. మొత్తంగా మూడు ఎమ్మెల్సీల్లో ఎవరు అదృష్టవంతులో చూడాలి.