అన్ని పార్టీల్లోనూ నాయకత్వ సమస్యే
అదే గులాబీ నేతకు కలసివస్తున్న విషయం
ఎన్నికల నాటికి మరింత బలహీన పడనున్న విపక్షాలు
హైదరాబాద్,జూలై6(జనం సాక్షి): తెలంగాణ ఏర్పడిన తరవాత గత నాలుగేళ్లుగా సిఎం కెసిఆర్ త్రివిక్రముడిగా ఎదిగారు. వివిధ పథకాలతో ప్రజలకు చేరువయ్యారు. అన్ని వర్గాలనుఆకట్టుకునేలా అనేక పథకాలు ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్నాయి. విపక్షాలకు అస్త్రాలు లేకుండా చేశారు.అలాగే ఆయన మాటకు ఎదురొడ్డి నిలిచే వ్యవహారం టిఆర్ఎస్లో లేకుండా పోయింది. ఆయన కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి. దీనికితోడు తెలంగాణలో టిఆర్ఎస్కు తిరుగులేకుండా పోయింది. అలాగని కెసిఆర్‌ను ఎదరించి నిలబడే దమ్ము,సత్తా ఉన్న లీడర్ కూడా విపక్షాల్లో లేకుండా పోయారు. ఈ ఏడాది చివరలో ఎన్నికలకు వెళుతున్న సమయంలో ప్రభుత్వ తప్పిదాలను బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో విపక్షాలు విఫలమయ్యాయి. అందుకే కాంగ్రెస్,టిడిపి, బిజెపిలు ఎంతగా పోరాడినా, ఉద్యమించినా లాభం లేకుండా పోతోంది. క్యాడర్ అంతా టిఆర్ఎస్ వైపు చూస్తోంది. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం అని చెప్పగల నాయకుడు ఒక్కరు కూడా తెలంగాణలో లేకపోవడం కూడా ఆయా పార్టీలకు మైనస్‌గా భావించాలి. టిడిపి, బిజెపి, కాంగ్రెస్, కమ్యూనిస్టుల్లో గ్టటిగా మాట్లాడి పోరాడగలిగిన వారు లేరు. ఈ దశలో కొత్త నాయకులు వస్తే తప్ప ఆయా పార్టీలకు భవిష్యత్ లేకుండా పోవడం ఖాయం. ప్రజలు ఇప్పిటికి కూడా కెసిఆర్ చెప్పిందే నమ్ముతున్నారు తప్ప విపక్షాలను విశ్వసించడం లేదు. అందుకే కెసిఆర్‌కు ఆదరణ పెరగడే గాకుండా వచ్చే ఐదేళ్లు కూడా అధికారం కెసిఆర్‌దే అని ప్రజలు భావిస్తున్నారు. దీనికితోడు వివిధ పథకాలు కూడా మెల్లగా ప్రజలకు చేరుతున్నాయి. ఇటీవల సిఎం కెసిఆర్ చెయించిన సర్వేలో 110 సీట్ల వరకు వస్తాయని చెప్పడం మాటెలా ఉన్నా ప్రజలు మాత్రం మళ్లీ టిఆర్ఎస్కే పట్టం అని డిసైడ్ అయ్యారు. దీంతో ఆయా పార్టీల్లో ఉన్న నేతలు విమర్శలు చేస్తున్నా వచ్చే ఎన్నికల నాటికి గులాబీ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరో రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోవడమే దీనికి కారణం. కాంగ్రెస్, టిడిపి, బిజెపిల్లో నాయకత్వ సమస్య ఉంది. ప్రస్తుతం ఉన్న నేతలెవరూ కెసిఆర్ దరిదాపుల్లో నిల్చునే స్థాయిలో లేరు. ప్రజలుకూడా ఇదే అంచనాలో ఉన్నారు. అవతలి పార్టీలు బలంగా లేకపోవడం,
వచ్చే ఎన్నికల్లో మార్పు వస్తుందన్న ఆశ లేకపోవడంతో ఈ పరిస్తితి ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో కొత్త పాలన ప్రారంభమయ్యాక జిల్లాల్లో గతంలో ఉన్న నాయకత్వ పెత్తనం తగ్గుతూ వస్తోంది. ఇది కూడా టిఆర్ఎస్కు బాగా కలసి వస్తోంది. దీనికి తోడు ఇతర పార్టీల్లో ఉన్న నేతలు మెల్లగా గులాబీ దళంలో చేరుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన నేతలు మెల్లగా తెలంగాణ రాష్ట్రసమితిలో చేరాలని ఉత్సాహం చూపడం వెనక కెసిఆర్ బలమైన నాయకుడు కావడం కూడా కారణంగా చూడాలి. మరోవైపు తెలంగాణలో కెసిఆర్‌కు ఎదురొడ్డి నిలిచే నాయకుడు లేకపోవడం వల్ల ఇతర పార్టీల్లో ఉన్న వారికి నమ్మకం లేకుండా పోతోంది. ఉద్యమ పార్టీగా ఉన్నందున తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఎక్కువగా కొత్తరక్తం వచ్చి చేరుతోంది. దీంతో ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు బలమైన నాయకులుగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి నాయకత్వ పటిమ వల్లనే ఇతర పార్టీల్లో ఉన్న వారు అధికార పార్టీ కండువా కప్పుకోవాలని ఆశిస్తున్నారు. అమిత్‌షా పర్యటనతోనే పార్టీ బలోపేతం అయిందని బిజెపి భ్రమపడితే దానికి ఈ మాత్రం ఆదరణ కూడా ఉండదు. తెలంగాణ సెంటిమెంట్ పునాదులు ఇంకా బలంగా ఉండడం వంటి కారణాల వల్ల బిజెపి, కాంగ్రెస్, టిడిపిలకు అవకాశాలు రాకపోవచ్చు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయ సవిూకరణాలు మొదలయ్యాయి. అందుకే పలువురు అధికార పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఆయాయ పార్టీలు తెలంగాణలో మరింత బలహీనం కావడం తప్పకపోవచ్చు. ఇకపోతే జిల్లాల పరిధి తగ్గి నాయకులకు ప్రాధాన్యం పెరిగింది. కొత్త నాయకత్వానికి అవకాశం ఏర్పడింది. ఇదే దశలో ఆయా పార్టీలు కూడా ఇక తమ జిల్లాల విభాగాల ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. తెలంగాణ ఏర్పడ్డ వెంటనే కూడా ఆయా పార్టీలు తమ పార్టీలకు కొత్త అధ్యక్షులను
నియమించారు. టిడిపి, కాంగ్రెస్,బిజెపిలు కూడా ఉమ్మడి నాయకత్వం నుంచి బయటపడ్డాయి. ఇప్పుడు తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా కొత్తగా నాయకత్వం పుట్టుకుని వచ్చే అవకాశాలు పెరిగాయి. పాతుకుపోయిన వారికి కాలం చెల్లిందనే చెప్పాలి. అన్ని పార్టీలు విధిగా కొత్త రక్తాన్ని తీసుకుని రావాల్సి ఉంటుంది. అందుకే యువతకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ప్రతిజిల్లాకు అనివార్యంగా కొత్త నాయకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓ రకంగా అన్ని పార్టీలకు నాయకత్వం పెరిగినా అధికార పార్టీ టిఆర్ఎస్కు మాత్రమే ఇది బాగా లాభిస్తోంది. అన్ని ప్రాంతాల నుంచి నాయకలు టిఆర్ఎస్లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టిఆర్ఎస్లో బహుళ నాయకత్వం ఉంది. అనేకులు సమర్థులైన నేతలుగా ఎదిగారు. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో వీరంతా కీలక భూమిక పోషించే అవకాశాలు వచ్చాయి. జిల్లాల పునర్విభజన చేయడంతో బడుగుబలహీన వర్గాలకు అవకాశం ఇవ్వడం వంటి కారణాల వల్ల కొత్త నాయకత్వానికి అవకాశాలు పెరిగాయి. జిల్లాల పరిధి చిన్నది కావడం వల్ల కొత్త సమస్యలు ఉంటాయి. వాటిని పట్టుకుని పరిష్కరించే సత్తా చూపితే నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. దీంతో ఇప్పుడు విపక్షాలకు ఇది ఊహించని దెబ్బ కాగలదు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల కొత్త నాయకత్వం ఎదిగివచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పుడు బలంగా ఉన్న నాయకులలో కొందరు బలహీనపడే అవకాశం ఉంది. నియోజకవర్గాల పెంపు, జిల్లాల పెంపు వంటి విషయాలలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగానే మారిందనడంలో సందేహం లేదు. దీనివల్ల గులాబీ దళాలు మరింతగా విస్తరించే అవకాశాలు పెరిగాయి. దీంతో మరోరెండు దశాబ్దాలపాటు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోగల సమర్థులు ఉండకపోవచ్చు. గతంలో ముఖ్యమంత్రులకు దీటైన నాయకులు మంత్రివర్గంలో కనిపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలు వ్యక్తులు,
కుటుంబాలపై ఆధారపడి ఉంటాయి కనుక ఆ పార్టీలో ప్రత్యామ్నాయ నాయకులు ఎదిగే అవకాశం ఉండదు. అందుకే తెలంగాణలో మరో పదికాలాల పాటు కెసిఆర్‌కు ఎదురుండకపోవచ్చు.




