Friday, 6 November 2026

తెలంగాణలో శైవ క్షేత్రాల్లో భక్తుల సందడి

వేములవాడలో పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో శివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి పెరిగింది. శినామ స్మరణతో ఆలయాలు

మార్మోగుతున్నాయి. వేకువ జాము నుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్‌ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం, కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం అర్చక బృందం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లా ఎస్పీ శివకుమార్‌ దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫునజిల్లా కలెక్టర్‌ నీతూ కుమారి ప్రసాద్‌ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజన్నను దర్శించుకునేందుకు దాదాపు 2 లక్షలమందికి పైగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో మహాశివరాత్రి జాతర వైభవంగా ప్రారంభమైంది. రాతిగుహలో వెలిసిన వనదుర్గ భవానీమాతకు అర్చకులు అభిషేకం, అర్చన నిర్వహించి జాతరను ప్రారంభించారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారు సర్వాలంకారణ భూషితమై భక్తులకు దర్శనమిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు మంజీరనదీ పాయల్లో పవిత్ర స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అభిషేకాలు, పూజలతో శివనామం జపిస్తూ తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు. క్యూలైన్లలో అరకిలోవిూటరు వరకు భక్తులు బారులు తీరారు. జిల్లా రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. గుట్ట పైభాగంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *