Wednesday, 4 November 2026

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల పోరాటంతోనే.. 

తెలంగాణ సాధ్యమైంది
– హైకమాండ్‌తో పోట్లాడి తెలంగాణ సాధించుకున్నాం
– కృతజ్ఞతుంటే కాంగ్రెస్‌ ఎంపీలపై పోటీ పెట్టకూడదు
– కాంగ్రెస్‌ నేత అంజన్‌కుమార్‌ యాదవ్‌
హైదరాబాద్‌, జులై6(జ‌నం సాక్షి ) : తెలంగాణను నేనే తెచ్చానని కేసీఆర్‌ చెప్పడం సిగ్గుచేటని, తెలంగాణ కాంగ్రెస్‌ నేతల పోరాటంతో సోనియాగాంధీ సహకారంతో తెలంగాణను సాధించుకున్నామని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే.. అది తెలంగాణ కాంగ్రెస్‌ నేతల పోరాటం వల్లే సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు హైకమాండ్‌తో కొట్లాడి రాష్ట్రం సాధించామని చెప్పారు. అలాంటిది మంత్రి కేటీఆర్‌.. సోనియాగాంధీని అమ్మా కాదు.. బొమ్మా కాదంటావా? అంటూ మండిపడ్డారు. కేటీఆర్‌.. సోనియా కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటే పుణ్యమైన వస్తుందని సలహా ఇచ్చారు. ఇకనైనా కేటీఆర్‌ నోటి దురుసుతనం మానుకోవాలని హెచ్చరించారు. కేటీఆర్‌ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్దారని ఆరోపించారు. అవినీతిని వెలుగులోకి తెచ్చి ప్రజలముందుంచుతామని అన్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తెచ్చుకున్న తెలంగాణను తనఖాతాలో వేసుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. తెలంగాణను దోచుకుంటున్నాడని మండిపడ్డారు. ప్రాజెక్టులతో పాటు, ఇతర పనుల్లో అవినీతి అక్రమాలకుపాల్పడూ కేసీఆర్‌ కుటుంబం కోట్లకు పడగలెత్తిందన్నారు. సోనియాపై కృతజ్ఞత ఉంటే తెలంగాణ కోసం పోరాడిన ఎంపీలపై పోటీ పెట్టకూడదన్నారు. అబద్ధాలు చెప్పి కేసీఆర్‌ గద్దెనెక్కారని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటేనని అంజన్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.