Thursday, 5 November 2026

తెలంగాణ పథకాలే దేశానికి ఆదర్శం

– గిరిజనుల్లో నైపుణ్య ఉన్న వారికోసం పెట్టుబడి రాయితీ
– మహిళలకు 45శాతం, పురుషులకు 35శాతం రాయితీ
– రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మంత్రి ఈటల
– గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తాం
–  కేంద్ర గిరిజనశాఖ మంత్రి జోయల్‌ ఓరం
– జాతీయ గిరిజన పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొన్న మంత్రులు
హైదరాబాద్‌, జులై13(జ‌నం సాక్షి) : తెలంగాణలోని పథకాలే దేశానికి ఆదర్శమని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం నగరంలోని ¬టల్‌ మారియట్‌లో జరిగిన జాతీయ గిరిజన పారిశ్రామికవేత్తల సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రి జోయల్‌ ఓరం, మంత్రి చందూలాల్‌, ఎంపీ సీతారాం నాయక్‌, ఎమ్మెల్సీ రాములు నాయక్‌, న్యూఢిల్లీలో అధికార ప్రతినిధి రామచంద్రుడు హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి ఈటల.. గిరిజనుల్లో నైపుణ్యం ఉన్న వారి కోసం పెట్టుబడి రాయితీ ఇస్తున్నామన్నారు. మహిళలకు 45 శాతం, పురుషులకు 35 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తున్నామన్నారు. తెలంగాణలో జరుగుతున్న కాంట్రాక్టు పనుల్లో గిరిజనులకు రిజర్వేషన్‌ ఇస్తున్నమని మంత్రి తెలిపారు. డ్రైవర్‌ ఓనర్‌ స్కీమ్‌ కింద ఒక్క కారుకు రూ.5 లక్షల రాయితీ ఇచ్చినట్లు మంత్రి గుర్తు చేశారు. గిరిజన రైతుకు 95 శాతం రాయితీతో ట్రాక్టర్‌ అందిస్తున్నమని.. డ్రిప్‌, గ్రీన్‌హౌస్‌ను 100 శాతం రాయితీతో అందజేస్తున్నమన్నారు. సివిల్‌ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తున్నమన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వ్యవసాయ పరికరాలపై 95 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నమని మంత్రి తెలిపారు. నీరవ్‌ మోదీ లాంటి వాళ్లు వేలకోట్ల రుణాలు తీసుకొని ఎగ్గొడుతున్నారన్న మంత్రి… చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదన్నారు. తెలంగాణలో 85 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారన్న ఈటల.. వారందరి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నమని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి చందూలాల్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా గిరిజనులు ఇంకా వెనుకబడే ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్‌ వెల్ఫేర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తామని కేంద్ర గిరిజనశాఖ మంత్రి జోయల్‌ ఓరం అన్నారు. గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి కేంద్రం ముందుంటుందన్నారు. ప్రస్తుతం గిరిజనులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేయాలని అందుకు కేంద్రం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. అనంతరం ఎంపీ సీతారాం నాయక్‌ మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది.. గురుకుల విద్యాలయాల్లో
విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన పారిశ్రామిక వేత్తలకు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాములు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.