హైదరాబాద్ : తెలంగాణలో గుడుంబాను తరిమికొడతానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. గుడుంబా తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని అనేకసార్లు ప్రకటించారు. దీంతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. అయితే ఇంతలోనే సర్కార్ మదిలో మరో కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. గుడుంబాను నిరోధించి చీప్ లిక్కర్‌ను తెస్తే ఎలా ఉంటుందా అని పరిశీలించింది. సర్కార్ ఆలోచనకు ఎక్సైజ్‌శాఖ వంత పాడింది. దీంతో నాణ్యమైన చీప్ లిక్కర్‌ను విక్రయించేందుకు సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోపక్క అర్ధరాత్రి వరకు వైన్‌షాపులు తెరిచే ఉంచడంతో పాటు.. విదేశీ మద్యాన్ని మాల్స్‌లో సైతం విక్రయించేందుకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
ఐద్వా ఆధ్వర్యంలో బస్సు జాతా..
మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించాలని చూస్తున్న తెలంగాణ సర్కార్ తీరుపై మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామన్న సర్కార్… సారా తెలంగాణగా మారుస్తోందని మండిపడుతున్నారు. మద్యం విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో బస్సు జాతాను ప్రారంభించారు. మద్యం వల్ల జరిగే అనర్ధాలను ప్రజలకు వివరించి.. పోరాటాలు ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందో ?
ఇక మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి సారా వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్సైజ్ పాలసీపై ప్రభుత్వం పునరాలోచించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మద్యం విక్రయాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ నిర్ణయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.




