” తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే బిజెపికి అధికారం దక్కాల్సిందే – బిజెవైఎం నాయకురాలు కసిరెడ్డి సింధురెడ్డి “
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20( జనంసాక్షి): గులాబీ దండు మిడతల దండను మించి తెలంగాణ రాష్ట్రాన్ని అళ్ళకల్లోలం చేస్తుందని, వారి చెరనుండి రాష్ట్రం బతికి బట్ట కట్టాలంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సింధురెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలో కొనసాగుతున్న ప్రజాసంగ్రామయాత్ర 4వ విడత కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయనతో కలిసి మేడ్చల్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందానగర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ గణిత రాష్ట్రమైన తెలంగాణను 4 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్ సర్కారు విడతల దండును మించి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, జీవచ్చవంలా మారిన తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధిలోకి తీసుకొని రావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంవొక్కటే ప్రత్యామ్నాయమన్నారు. కెసిఆర్ కుటుంబ పాలన, రాష్ట్ర దోపిడీని నిర్మూలించడంతోపాటు ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ బండి సంజయ్ నిర్వహిస్తున్న పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలనుండి విశేష ఆదరణ లభిస్తుందని, బిజెపికి లభిస్తున్న మద్దతును చూసి ముఖ్యమంత్రి గుండెలు జారిపోతున్నాయని, ఆయన త్వరలోనే శ్రీకృష్ణ జన్మస్థలానికి చేరుకోవడం ఖాయమని ఆమె జోస్యంచెప్పారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు మరోసారి ఆలోచించి సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి అధికారం కట్టబెట్టాలని, మరణశయ్యపై ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పునర్జీవనం కల్పించాల్సిన బాధ్యతను సింధురెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area