హైదరాబాద్: 43శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకార్మికులు సమ్మె చేయడంతో బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. మంగళవారం అర్థరాత్రి నుంచి ఎంప్లాయిస్ యూనియన్, టీఎంయూ కార్మిక సంఘాలు పూర్తిస్థాయిలో సమ్మెబాటపట్టాయి. రాత్రి నుంచే దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కార్మికుల సమ్మె కారణంగా హైదరాబాద్ జంటనగరాల్లోని 17 డిపోల్లో 3,800 బస్సులు.. వరంగల్ జిల్లా పరిధిలోని 9 డిపోల్లో 951 బస్సులు, మహబూబ్‌నగర్ జిల్లాలోని 9 డిపోల్లో 893 బస్సులు, నల్లగొండ జిల్లాలోని 7 డిపోల్లో 750 బస్సులు నిలిచిపోయాయి. అటు కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల్లో 920 బస్సులు.. నిజామాబాద్ జిల్లాలోని 6 డిపోల్లో 669 బస్సులు, మెదక్ జిల్లాలోని 6 డిపోల్లో 669 బస్సులు.. ఖమ్మం జిల్లాలోని ఆరు డిపోల్లో 560 బస్సులు నిలిచిపోయాయి. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్సు డిపోల ఎదుట కార్మికులు బైటాయించి ఆందోళన చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో….
ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. విధులు బహిష్కరించిన 3200 కార్మికులు బస్సులు డిపోనుంచి బయటకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి ఉత్తమ్ మరిన్ని వివరాలు అందిస్తారు.
మహబూబ్ నగర్ జిల్లాలో….
మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉద్ధృతమైంది. సమ్మె ప్రభావంతో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి.
కరీంనగర్ జిల్లాలో….
కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా అన్ని డిపోల్లో ఎదుట కార్మికులు ఆందోళణ చేపడుతున్నారు.
మెదక్ జిల్లాలో….
మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. విధులు బహిష్కరించిన కార్మికులు ఆందోళన బాట పట్టారు. డిపోల నుంచి బస్సులు బయటకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు.
నల్లగొండ జిల్లాలో…
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో నల్లగొండ జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 7 డిపోలకు సంబంధించి 700 బస్సులు నిలిచిపోయాయి. 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచుతామనడం సమంజసం కాదని.. కార్మికనేతలు ఫైర్ అయ్యారు. సంస్థ నష్టాల్లో కూరుకుపోవడానికి ఆర్టీసీ ఉన్నతాధికారులే కారణమన్నారు.




