హైదరాబాద్,మార్చి2(జనంసాక్షి): టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదని ఆ సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులువిమర్శించారు. కొత్త రాష్ట్రం ఏర్పడడం వల్ల అద్భుతం జరిగిపోతుందన్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హావిూనిచ్చారని గుర్తు చేశారు. దీనితో చాలా మంది ప్రజలు ఆశలు పెట్టుకున్నారని, కానీ వారి ఆశలు నెరవేరే అవకాశాలున్నాయా లేదా ? అనేది ప్రధాన అంశమన్నారు. సీపీఎం తెలంగాణ తొలి మహాసభల్లో ప్రధానమైన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. దానిపై చర్చించారు. తెలంగాణలో భవిష్యత్ పోరాటాలు, సీపీఎం నిర్వహించాల్సిన పాత్రపై వామపక్ష నేతలు చర్చించినట్లు చెప్పారు. తొలుత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం ప్రవేశ పెట్టిన రాజకీయ నిర్మాణంపై చర్చ ప్రారంభమైందన్నారు. దాదాపు పది మంది కార్యకర్తలు, నాయకులకు ప్రసంగించడం జరిగిందన్నారు. ఇందులో రాజకీయ తీర్మానం ప్రధాన అంశంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సంపన్నులు, కార్పొరేట్ వర్గాలకు అభివృద్ధి జరిగే అవకాశం ఉందని, బలహీన, వెనుకబడిన తరగతులకు అవకాశం లేదని చర్చల్లో అభిప్రాయం వచ్చినట్లు తెలిపారు. సమగ్ర పథకం రూపొందించుకుని వివిధ వర్గాల ప్రజలు, మేధావులను ప్రతి ఒక్కరి శక్తిని కూడగొట్టుకోవాలనే దానిపై చర్చ జరిగిందన్నారు. తెలుగు ప్రజలు ఐక్యంగాఉండాలని, పక్క పక్క రాష్టాల్రు ఎంత సయోధ్యగా ఉంటే ప్రజలకు లాభం జరుగుతుందన్నారు. సామరస్యంగా ఇరు రాష్ట్ర సీఎంలు వ్యవహరించడం లేదనే మా విమర్శ అని తెలిపారు. విభజన చట్టంలో చాలా సమస్యలు న్నాయని, కొన్ని వ్యవస్థలు రూపొందించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కువ చర్చలు జరపాల్సి ఉంది కానీ ఇరు రాష్ట్ర సీఎంలకు ఓపిక, తీరిక లేదనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రెండు రాష్టాల్రకు కేంద్రం చాలా నిధులు ఇవ్వాల్సి ఉందని, కానీ బడ్జెట్ లో నిధులు కేటాయించలేదన్నారు.




