హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 19,జనంసాక్షి:
హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు పూర్తి మౌలిక వసతులు కల్పించేందుకు జిహెచ్ఎంసి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది.సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచే క్రమంలో ఎస్.ఆర్.డి.పి తో చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానున్నది. వాహన రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ముందుగా ప్రాధాన్యతనిచ్చి అవసరమున్న చోట ఫ్లై ఓవర్లు, ఆర్ ఓ బి లు, అండర్ పాస్ లు నగరానికి నలువైపులా నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడం జరుగుతున్నది.ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. నాగోల్ లో చేపట్టిన ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా నేరుగా ఎల్బీనగర్ నుండి ఉప్పల్ వరకు అక్కడి నుండి వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లా లకు గాని సికింద్రాబాద్, ఇ.సి.ఎల్ ప్రాంతాలకు అనుకున్న ప్రాంతానికి వెళ్లే వారికి సులభతరం అవుతుంది.
జిహెచ్ఎంసి స్వంత నిధులతో చేపడుతున్న ఎస్.ఆర్.డి.పి ద్వారా మొత్తం 41 వివిధ రకాల పనులను చేపట్టారు. జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, హెచ్.ఎం.డి.ఏ ద్వారా మరో 6 పనులు కలిపి మొత్తం 47 పనులు చేపట్టారు. అందులో ఇప్పటి వరకు 31 పనులు పూర్తయ్యాయి. మొత్తం పూర్తయిన 31 పనులు ఆయా శాఖలకు చెందిన 3 పనులు కలవు. నాగోల్ లో చేపట్టిన పనులు త్వరలో పూర్తయ్యి అందుబాటులోకి రానున్నది. ఇప్పటివరకు ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 32 పనులు పూర్తవుతాయి. దీంతో 16 ఫ్లై ఓవర్ ల ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించబడింది. వీటితో పాటు 7 ఆర్ ఓ బి లు, 5 అండర్ పాస్ లు అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మెరుగు పడింది.నాగోల్ లో చేపట్టిన ఫ్లైఓవర్ ను భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ రూ.143.58 కోట్ల వ్యయం కాగా సివిల్ వర్క్స్ చేపట్టడానికి రూ. 69 కోట్ల వ్యయంతో 990 మీటర్ల ఫ్లై ఓవర్ కారిడార్ ను చేపట్టారు. ఇక్కడ 200 ఫీట్ల గల మాస్టర్ ప్లాన్ ను ప్రతిపాదించారు. రెండు మార్గాలు కలిగిన ఫ్లై ఓవర్ 24 మీటర్ల వెడల్పు 6 లైన్ల బై డైరెక్షన్ క్యారేజ్ వే ను చేపట్టారు. 23 పిల్లర్స్, 22 స్పాన్స్ తో 600 మీటర్ల వయాడక్ట్ పొజిషన్ 300 మీటర్ల అప్రోచ్ పొడవు తో ఆర్.ఇ వాల్ చేపట్టారు.ఈ ఫ్లై ఓవర్ వలన ఎల్బీనగర్ నుండి ట్రాఫిక్ కు సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. తద్వారా డీజిల్ ఆదా, వాహన వేగం పెరగడం ట్రావెల్ సమయం తగ్గడమే కాకుండా వాహన నిర్వహణ వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన మిగతా 15 పనులు మొత్తం 2023 చివరి నాటికి పూర్తి కానున్నాయి.




