– మూడేళ్లలో 12వేల ఉద్యోగాలను భర్తీ చేశాం
– టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
– టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన చక్రపాణి
హైదరాబాద్, జూన్2(జనం సాక్షి) : త్వరలో 20 వేల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం టీఎస్‌పీఎస్‌సీ శాఖ కార్యాలయంలో ఘంటా జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల్లో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం వేలాది మంది త్యాగాలు చేశారని..అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో శాఖా సిబ్బంది నిద్రాహారాలు మాని, ఉద్యోగ భర్తీ కోసం పని చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పునఃనిర్మాణానికి కావాల్సిన ఉద్యోగులను అందిస్తున్న సంస్ధ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు. కొందరు కావాలనే ఉద్యోగుల నైతికతను, కమిషన్ రాజ్యాంగ బద్దతను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని..ఈ వ్యాఖ్యలు శాఖా అప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. తప్పుడు ప్రచారాలపై ఎవరు వ్యవహరించిన చట్ట పరమైన చర్యలు తప్పవని తెలిపారు. తాము చేయని తప్పులను, నియమకాలను తమపై మోపుతున్నారని, నిరుద్యోగులను నిరాశకు గురిచేసే విదంగా కొన్ని విూడియాసంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలను టీఎస్‌పీఎస్‌సి ఉపేక్షించదన్నారు. త్వరలోనే 8వేల ఉద్యోగాల భర్తీకి ఫలితాలను ఇవ్వబోతున్నామని ఘంటా తెలిపారు. అందులో టీఆర్‌ఎటీ ఫలితాలూ ఉంటాయన్నారు. పూర్తిగా మెరిట్ లిస్టును జిల్లాల వారిగా ప్రకటిస్తామన్న ఆయన..ఈ నెలలోనే మరో రెండు మూడు ముఖ్యమైన నోటిఫికేషన్లను విడుదల చేస్తామన్నారు.125 గ్రూప్-1 ఉద్యోగాలు భర్తీ చేయలనుకున్నామని..అయితే జోనల్ వ్యవస్థ కారణంగా జాప్యం జరిగిందన్నారు. వారంలో టీచర్ నియామక పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లు ఇస్తామని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు.




