హైదరాబాద్,జూలై5(జనం సాక్షి ): దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ హరి పేర్కొన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు గురువారం హెచ్‌బీ కాలనీ వార్డు కార్యాలయంలో కుట్టుమిషన్లు, సర్టిఫికేట్లు ఆయన పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్న స్వయం ఉపాధి కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే హెచ్‌బీ కాలనీ డివిజనులో మహిళ భవనం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇస్తూ అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న ఈ సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, కార్పొరేటర్ అంజయ్య, సీడీఎస్ డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.




