ఈ ఏడాది దసరా పండుగ నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నూతన జిల్లాల ఏర్పాటుపై హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో ఇప్పటివరకు జరిగిన అధ్యయనంపై సమావేశంలో చర్చించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, జనాభా, భౌగోళిక అంశాల దృష్ట్యా వచ్చిన కొత్త జిల్లాల ప్రతిపాదనలపై డిస్కస్ చేశారు. రాజకీయ డిమాండ్లను పెద్దగా పట్టించుకోకుండా… ప్రజల సౌకర్యం, పరిపాలన సౌలభ్యం, భౌగోళిక నేపథ్యం, వెనుకబాటుతనాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ ఏడాది దసరా పండుగ నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలి కాబట్టి ఆలోపే అధికార ప్రక్రియలన్నింటినీ ముగించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నెల 22 ప్రాంతంలో కొత్త జిల్లాలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అన్ని అంశాలను అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన మరో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజెందర్, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కు ముందే కేబినెట్ సమావేశం, అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నెల రోజుల సమయమివ్వాలన్నారు. ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించాలని చెప్పారు. తర్వాత 15 రోజుల్లో వాటిని పరిష్కరించి తుది ప్రకటన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
దసరా నుంచి కొత్త జిల్లాల మనుగడలోకి వస్తున్న నేపథ్యంలో అధికారుల విభజన, కార్యాలయాల సంసిద్ధతను వేగంగా పూర్తి చేయాలన్నారు సీఎం కేసీఆర్. కొత్త జిల్లాలలో అధికార యంత్రాంగం ఎలా ఉండాలి? న్యాయ అధికార పరిధి ఏ మేరకు ఉండాలి? అధికార వ్యవస్థ ఎలా ఉండాలి? తదితర అంశాలపై అధ్యయనం చేసి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జోనల్ సమస్యలను అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని సూచించారు.
మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, టీఎస్ ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రేమండ్ పీటర్, ప్రదీప్ చంద్ర, ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, ఈ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు.




