బంజారాహిల్స్/హైదరాబాద్: చిట్టీల రూపంలో దాచుకున్న డబ్బును అడిగినందుకు మహిళను బాత్‌రూంలో నిర్బంధించాడు ఓ వ్యక్తి! బంధించడమే కాదు దుర్భాషలాడి, అనుచితంగా ప్రవర్తించి అవమానించాడు. బెదిరించాడు. చివరికి నిర్భయ చట్టం కింద ఊచలు లెక్కిస్తున్నాడు. జూబ్లిహిల్స్ పరిధిలోని యాదగిరినగర్‌కు చెందిన మహాలక్ష్మి అనే గృహిణి.. అదే బస్తీకి చెందిన నర్సింహ అనే వ్యక్తి వద్ద చిట్టీలు కడుతూ పొదుపుచేయసాగింది. రూ.3.5 లక్షలు కట్టిన అనంతరం డబ్బు ఇవ్వాల్సిందిగా నర్సింహను అడిగింది. ఆమెకు డబ్బు కట్టకపోగా రివర్సులో ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు అతడు. ఈ క్రమంలోనే బుధవారం నర్సింహ ఇంటికి వెళ్లింది మహాలక్ష్మి డబ్బు అడిగింది. ఇద్దరి మధ్యా మాటామాట పెరగడంతో.. నర్సింహ ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించాడు. అంతే కాకుండా కుమారుడు, భార్య, మేనల్లుడితో కలిసి ఆమెను బాత్‌రూంలో గంట పాటు నిర్బంధించాడు. అనంతరం దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు జూబ్సిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతేగాకుండా పోలీసుల విచారణలో నర్సింహ చిట్టీల పేరుతో చాలామందికి రూ.3 కోట్ల మేర టోపీ పెట్టినట్లు తేలింది. బాధితుల ఫిర్యాదుతో అతడిపై మరో కేసు పెడతామని పోలీసులు తెలిపారు.




