Tuesday, 3 November 2026

దిగుబడులకు తోడు గిట్టుబాటు ధరల సమస్య

వ్యవసాయం చేస్తున్నా రైతులకు తీరని వ్యధ

కేంద్రం పథకాలు ప్రకటిస్తున్నా ఆచరణలో శూన్యం

హైదరాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): వ్యవసాయంపై ఆధారపడుతూ జీవనం సాగించడం కష్టంగా మారింది. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసినప్పట్టికీ, సరైన దిగుబడులు రావడం లేదు. దీంతో నష్టాలు మాత్రమే మిగులు తున్నాయి. భూమిలో సారవంతం లేకపోవడం వాతావరణ పరిస్ధితుల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.అయితే రైతులు అందరిలో మార్పు రావాల్సి ఉందని అందుకు అనేక పథకాలు తోడ్పడుతాయని అంటున్నారు. భూసార పరిక్షల విశ్లేషణ పత్రాలను రైతులకు అందిస్తున్నా అందుకు తగ్గట్లుగా సేంద్రియ ఎరువులు, సేంద్రియ విత్తనాలు సరఫరా కావడం లేదు. అలా చేస్తే తప్ప భూసార పరీక్షలను నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. తద్వారా రైతులు భూమికి అవసరమైన పోషకాలను మాత్రమే వినియోగించవచ్చు. అవసరం లేని రసాయనిక ఎరువులవాడకాన్ని తగ్గించడానికి వారిని చైతన్యం చేయాల్సి ఉంది. రసాయనిక ఎరువుల స్ధానంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిపిస్తున్నా, తగినంత మోతాదులో లేదు. భూమిలో సారవంతం తగ్గకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్న విషయం రైతులకు అవగాహన కలిగేలా చేయాలి. అప్పుడే రైతులు కూడా ముందుకు వస్తారు. దీనికి తగ్గట్లుగా ప్రభుత్వ రైతాంగ విధానంలో మార్పుల రావాలి. సేంద్రియ ఎరువుల, విత్తనాలు అందుబాటులోకి తీసుకుని రావాలి. ఏ పంటలు వేయాలో గ్రామాల్లో అవగాహన కల్పించి, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామాన్న భరోసా ఇవ్వాలి. అప్పుడే వ్యవసాయంలో

మార్పులను ఆశించవచ్చు. కేంద్రం తాజా నిర్ణయాల మేరకు వ్యవసాయ ఎగుమతి విధానాన్ని వ్యూహాత్మక, నిర్వహణాత్మక అనే రెండు విభాగాలుగా విభజించారు. వ్యూహాత్మక విభాగంలో విధానపరమైన చర్యలు, మౌలిక సదుపాయాలు, రవాణా సహకారం, ఎగుమతుల్ని పెంచేందుకు సమగ్ర వైఖరి, రాష్ట్ర ప్రభుత్వాల్ని మమేకం చేయడం వంటి అంశాలున్నాయి. నిర్వహణాత్మక విభాగంలో సముదాయాల ఏర్పాటు, విలువ ఆధారిత ఎగుమతులకు ప్రోత్సాహం, మార్కెటింగ్‌, భారత బ్రాండ్‌ను పెంపొందించడం, ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షించడం, నాణ్యత ప్రమాణాల్ని నెలకొల్పడం, పరిశోధన, అభివృద్ధి వంటి కార్యకలాపాలు నిర్వహించడం వంటివున్నాయి. వ్యవసాయ ఎగుమతి విధానంఅమలును పరిశీలించేందుకు కేంద్రం స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయాలనే ప్రతిపాదననూ మంత్రివర్గం ఆమోదించింది. ఇది ఎంతమేరకు ఉపకరిస్తుందన్నది తీసుకునే చర్యలు బట్టి మాత్రమే అంచనావేయగలం.