శాంతిభద్రతలు కాపాడడంలో సర్కార్ విఫలం
మండిపడ్డ పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద
హైదరాబాద్,డిసెంబర్4(ఆర్ఎన్ఎ): షాద్నగర్ దిశ ఉదంతం యావత్ దేశాన్ని కదిల్చి పార్లమెంట్లో చర్చ జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్కు చీమకుట్టినట్లు కూడా లేదని పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్లశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిచండంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమవుతోందని అన్నారు. దిశ నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీ ప్రభుత్వ చెప్పు చేతల్లో ఉంటూ కనీస భద్రత కల్పించడం లేదని విమర్శించారు. జాతీయ రహదారిపై ఓ విద్యా వంతురాలిపై అత్యాచారం చేసి కాల్చి చంపిన దుండగులను బహిరంగంగా ఉరితీయడమే సరైన శిక్ష అని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎవరూ ఆడపిల్లల జోలికి వెళ్లకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సభ్య సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనపై సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె,మాజీ ఎంపీ కవిత స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరేమైపోతే మాకేంటి అన్న చందాన ఢిల్లీలో పెళ్లికి హాజరుకావడం సిగ్గుచేటన్నారు. దిశ కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం జరిగేంత వరకు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరగడానికి విచ్చలవిడిగా వెలసిన మధ్యం దుఖాణాలే కారణమన్నారు. జాతీయ రహదారులపై విచ్చల విడిగా మధ్యం దుకాణాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. ఆడపిల్లలపై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తా అని అన్న సీఎం కేసీఆర్ దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదో చెప్పాలన్నారు.




