*రోడ్డు మీద షెడ్ వేసిన జూబ్లీహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్
*ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ పెడతానంటూ కాలనీ వాసులకు బెదిరింపులు
*స్థానిక కార్పొరేటర్ అండతో ఎసై నే ఎదిరించిన కానిస్టేబుల్
*భయాందోళనలో కాలనీ వాసులు
హైదరాబాద్ సిటీ,అక్టోబర్ 18 జనంసాక్షి :
రక్షకుడే రాక్షసుడయ్యాడు… సమస్యలు వస్తే పోలీసుల వైపు చూస్తాము… అటువంటిది రక్షించాల్సిన ఓ పోలీసు సమస్యలు సృష్టించి ఇబ్బందులు పెడుతూ కేసులు పెడతానంటూ బెదిరింపులకు గురిచేస్తూ… రౌడీలాగా బెదిరిస్తుంటే ప్రజలు ఇంకెవరి వైపు చూస్తారు…? ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రజా ప్రతినిధి,అధికారులు ప్రజల వైపు ఉండకుండా కబ్జా రాయుళ్లకు అండగా ఉంటూ కొమ్ము కాస్తున్నారు.
అసలేం జరిగింది….
కాలనీ వాసుల వివరాల ప్రకారం…సికింద్రాబాద్ సర్కిల్ లోని న్యూ మెట్టుగూడా ,గోవిందపురంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జగదీష్ రోడ్డు మొత్తం కబ్జా చేస్తూ షేడ్ వేసాడు.అతని ఇంటి ముందు కాకుండా కొంత దూరంలో… 4,5 ఇండ్ల తరువాత ఇనుప స్తంభాలతో రోడ్డుకిరుపులా ఉన్న ఇళ్ల ముందు వచ్చేలాగా,పైన ఇండ్లకు 3ఫేజ్,11కెవి హైటెన్షన్ లైనును అనుకునే విధంగా ఎత్తులో పర్మినెంట్ షెడ్ వేసాడు.రోడ్డుకు పూర్తిగా వేయడంతో రాకపోకలకు ఇబ్బంది అయి కాలనీ వాసులు జగదీష్ ని అడిగితే వినాయక చవితి ఉంది కాబట్టి వేశాము, అప్పటివరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయవద్దని, అయిపోయాక ఎప్పుడు తీస్తామో చెప్తామని చెప్పాడు.వర్షం పడటం వల్ల ఇనుప స్తంబాలు ఇంటి గుమ్మం ముందు ఉండటంతో పిల్లలు, పెద్దలు అనుకోకుండా తగిలినా వాటి నుండి కరెంటు షాక్ రావడంతో భయంతో కాలనీ వారు దీనిని తీసివేయమని మళ్ళీ జగదీశ్ ని కోరారు.తీసేది ఉండదని,మీ దిక్కున్న చోటుకి పోయి చెప్పుకోమని, కులాలను రెచ్చగొట్టే మాటలతో గొడవకు దిగాడు. అతను వినడం లేదని కాలనివారు చిలకలగూడా పోలీసు స్టేషన్ లో అతని మీద ఆగస్టులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వినాయక నిమజ్జనం అయిపోయే వరకు ఆగమని పోలీసులు చెప్పడంతో కాలనీ వాసులు ఊరుకున్నారు. నిమ్మజనం అయి వారం అయినా కూడా తీయక పోవడంతో కాలనీ వారు జగదీష్ ను షెడ్ తీయమని మళ్ళీ అడగడంతో మీ మీద ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేస్ పెడతాను,మీ దిక్కున్న చోట చెప్పుకొండని గొడవకు దిగాడు.కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ సునీత కు సమస్యను తెలిపారు.కార్పొరేటర్ సునీత…నేను అతనితో మాట్లాడాను. మీ అందరి మీద ఎస్సి,ఎస్టీ కేస్ పెడతాను అని అంటున్నాడు,మనం అంతా ఒకే కులం వారిమి కాబట్టి సైలెంట్ గా ఉండమని చెప్పింది. చేసేది లేక కాలనీ వాసులు మళ్ళీ పోలీసు స్టేషన్ కి వెళ్లి సమాచారం అందించారు. చిలకల గూడ పొలీస్ స్టేషన్ లోని ఎసై జగదీష్ ని స్టేషన్ కు పిలిపించి కాలనీ వారి ముందే షెడ్ తీయమని అడుగగా నేను తీయను అని వీరి మీద ఎస్సి, ఎస్టీ కేస్ పెడతాను అని అందరూ నివ్వెర పోయేలా ఎసైకే ఎదురు సమాధానం చెప్పాడు.కంప్లైంట్ చేసిన వారిలో ఎస్సి వారు కూడా ఉన్నారు కాబట్టి ఇది అట్రాసిటీ కి సంబంధించిన విషయం కాదు. రోడ్డు మీద వేసిన షెడ్డు తీసేయాలని ఎసై అతనికి చెప్పారు.ఎసై చెప్పినా కూడా తీయకపోవడంతో ఇక అతన్ని పోలీసులు కూడా ఏమి చేయలేరని కాలనివారు అంతా కలిసి 15 మంది సంతకాలతో కూడిన ఫిర్యాదు 21 సెప్టెంబర్ లో మున్సిపల్ ఆఫీసు టౌన్ ప్లానింగ్ అధికారి ఏసిపి ముంతాజ్ బేగం కు ఇవ్వడం జరిగింది.మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న చందు వచ్చి జగదీష్ తో మాట్లాడిన తర్వాత కాలనీ వారితో… మీ ఇంటి ఏసీ ని తొలగిస్తే వారు షెడ్ తీస్తారని లేకపోతే తీయరని చెప్పి వెళ్ళిపోయాడు. ఫిర్యాదు చేసినా టౌన్ ప్లానింగ్ వారు పట్టించుకోక పోగా వారినే బెదిరిస్తున్నందున సికింద్రాబాద్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ని కలిసి విషయం తెలుపగా నోటీసు ఇచ్చి తొలగిస్తామని అన్నారని తెలిపారు.ఎన్నిమార్లు ఏసిపి ముంతాజ్ బేగం ను అడిగినా నోటీసు ఇచ్చామని చెప్తున్నారు కానీ ఇప్పటికి రెండు నెలలు గడుస్తున్నా ఆ షెడ్డు ను తొలగించడం లేదు.మాకేమైనా సమస్య వస్తే పోలీసులు ఉన్నారనే ధైర్యం ఉంటుంది కానీ ఇక్కడ రోడ్డును కబ్జా చేసి అందులో గుంపుగా చేరి తాగుతున్నారు. కాలనీ వాసులనే కాకుండా మహిళలను కూడా పోలీసు అంటూ జగదీష్ ఇబ్బంది పెడుతూ,మీ మీద అట్రాసిటీ కేసులు పెడతానంటూ ఒక రౌడీ లాగా భయపెడుతున్నారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడే తాగుతున్నారు…భయమేస్తుంది
-మాధవి
రావడానికి పోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఆఫీస్ నుండి వచ్చేప్పుడు ఇక్కడే గుంపులు గుంపులుగా మీటింగులు పెట్టి, తాగుతున్నారు. చాలా భయంగా ఉంది. షెడ్డు త్వరగా తీసేస్తే బాగుంటుంది.
కార్పొరేటర్ కు చెప్పినా ఎం చేస్తలేదు
-జాన్
మా బండ్లు సరిగా పోతలేవు. నా బండికి స్క్రాచ్ అవుతుంది. కంప్లైంట్ చేసినా యాక్షన్ లేదు. అది రోడ్డు పైన వేశారు. జిహెచ్ఎంసి వారు ఎందుకు తీయడం లేదో అర్థమైతలేదు. కార్పోరేటర్ కి చెప్పినా కూడా ఏం చేస్తలేదు.
పిల్లలు ముట్టుకుంటే షాక్ వస్తుంది
-రమ
పిల్లలు ముట్టుకుంటే షాక్ వస్తుంది. ఏమన్నా అయితే ఎట్లా. మేము కంప్లైంట్ కూడా ఇచ్చినం. అయినా ఎందుకు తీయడం లేదు. పెద్దోళ్ళు ఉన్నారు. వర్షాకాలం ఇది. ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది.
ఇంకెవరు పట్టించుకుంటారు…
-రాజు
ఇన్ని రోజులైంది కంప్లైంట్ ఇచ్చి. ఇంకా తీయడం లేదు. కరెంటు షాక్ వస్తుంది. ఏం పట్టించుకుంటలేరు. అందరికీ చెప్పినం పోలీసులకు, కార్పొరేటర్ కు, జిహెచ్ఎంసి ఆఫీసుకు కూడా పోయినం. ఏం చేస్తలేరంటే ఏం భయం లేనట్టుంది. నోటీసులు ఇచ్చారు. అంతా అయింది. అయినా తీస్తే లేరు. అతనికి పోలీసుల భయం లేదు. పొలిటికల్ భయం లేదు. మొత్తం భయం లేకుండా అయింది. మల్లోసారి జిహెచ్ఎంసి ముందు పోయి కూర్చుంటాం. అంతా కరెంటు పాస్ అవుతుంది. ఇంకెవరు పట్టించుకుంటారు.
మా గోడ పక్కనే వేసారు…ఇంట్లో పేషంట్లు ఉన్నారు..
-శైలజ
కంప్లైంట్ ఇచ్చిన ఏం పట్టించుకుంటలేరు. చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ వినాయక చవితి అని ఏసిల్లు. మా గోడ పక్కనే వేసిల్లు. అడుగుతే మాకు పర్మిషన్ ఉంది అయిపోయినంక తీసేస్తామని చెప్పిండు. అందుకని మేము గమ్మున ఊరుకున్నాము. దాని తర్వాత తీయమంటే తీస్తలేరు. గోడ పక్కకు ఇనుప స్తంభాలు పాతిళ్ళు. కరెంటు పవర్ ది ఎక్కువ ఉంది. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మా ఇంట్లో హార్ట్ పేషంటు, ఆస్తమా పేషంటు ఉంది. గాలి రావడం లేదు. పక్కనే బాత్రూంలో ఉంటాయి. షెడ్డులో మీటింగ్లు పెడుతున్నారు. మరి మెయిన్ గల్లి రోడ్డు మీద వేయడం ఏంది. ఈ షెడ్డు వేసినోళ్లది ఇల్లు ఎక్కడ ఉంటది. తీసుకొచ్చి మా ఇంటి పక్కన వేసిల్లు. మా సమస్య ఇది. మమ్మల్ని పట్టించుకోని మాకు న్యాయం చేయండి.




