– కాంగ్రెస్ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మరారు
– ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలతో కాంగ్రెస్ నేతల్లో భయం పట్టుకుంది
– జీహెచ్‌ఎంసీలో తాగునీటికి ఇబ్బందులు తొలగించాం
– అనతికాలంలో కేసీఆర్ కృషితో విద్యుత్ సమస్యను అధిగమించాం
– మిషన్ భగీరథతో త్వరలో ఇంటింటికి తాగునీరు
– కార్పొరేట్ సౌకర్యాలతో కూకట్‌పల్లి రైతుబజార్ నిర్మాణం
– ఆరు నెలలో రైతుబజార్‌ను పూర్తి చేస్తాం
– కుళ్లిన కూరగాయలు, వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి అందిస్తాం
– నగర అభివృద్ధికి కేటీఆర్ కృషి అమోఘం
– రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
– కూకట్ పల్లిలో కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు
హైదరాబాద్, ఆగస్టు3(జనం సాక్షి) : తెలంగాణ అమలవుతున్న పథకాలను చూసి దేశమొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందని, ఇలాంటి పథకాలను దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలుకు శ్రీకారం చుడుతున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం నగరంలోని కూకట్‌పల్లిలో రూ. 10 కోట్లతో నిర్మించనున్న ఆధునిక రైతు బజార్ కు రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కూకట్ పల్లి రైతు బజార్ ను కార్పోరేట్ సౌకర్యాలతో 50 వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మిస్తామని చెప్పారు. ఆరు నెలల్లో రైతు బజార్ ను పూర్తి చేస్తామన్నారు. కుళ్లిన కూరగాయలు, ఇక్కడి వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తిచేసి మార్కెట్‌కు సరఫరా చేస్తామని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్లు, మెట్రో, ఔటర్ రింగ్ రోడ్ వంటి అభివృద్ధి పనులతో హైదరాబాద్ ముఖచిత్రం మారిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ రాష్ట ప్రజలకు అందుతోందన్నారు. 24 గంటల విద్యుత్ కారణంగా ఇన్వర్టర్లు, జనరేటర్ల వ్యాపారం దివాళా తీసిందని, కాంగ్రెస్ పార్టీ సైతం దివాలా
తీసిందన్నారు. తెలంగాణ ఇస్తే రాష్ట్రం చీకటవుతుందని ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, చివరికి కాంగ్రెస్ పార్టీ చీకటిగా మారిందని ఎద్దెవా చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో పేకాట క్లబ్ లు, గుడుంబా వ్యాపారుల వద్ద కాంగ్రెస్ నేతలు మామూళ్లు వసూలు చేసేవారని చెప్పారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే పేకాట క్లబ్ లు, గుడుంబా వ్యాపారాన్ని మూయించారని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. కృష్ణా, గోదావరి, మంజీర మూడు నదుల నీళ్లు అందుతున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమేనన్నారు. ఈ మూడు నదుల్లో నీరు తగ్గినా, కాళేశ్వరం నీటిని లింక్ చేస్తే వందేళ్ల దాకా హైదరాబాద్ కు నీటి సమస్య ఉండదన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రజల తాగు నీటి అవసరాలు తీర్చేందుకు రెండు రిజర్వాయర్లను సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్ రాత్రింబవళ్ళు కష్టపడి లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నారన్నారు. ప్రజల సమస్యలకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందన్నారు. వేసవి వస్తే గతంలో కుండలతో జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట మహిళలు ధర్నాలుచేసే వారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఇలాంటి దృశ్యాలులేవని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున ఖాళీ కుండలు, క్యాండిళ్లు, లాంతర్లతో, ఎండిపోయిన కంకులతో ప్రదర్శనలు చేసేవారు. ఈ నాలుగేళ్ళలో అలాంటి దృశ్యాలు తమ ప్రభుత్వ హయాంలో కనబడలేదన్నారు. కరెంటు కోసం, తాగు నీటి కోసం ఒక్క రోజు ప్రతిపక్షాలు అసెంబ్లీలో మాట్లాడలేదన్నారు. ఇక మహిళలకు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలీవరి చేస్తే 12 వేల రూపాయలు, కేసీఆర్ కిట్ ఇచ్చి, ఆటో ఖర్చు లేకుండాతల్లిని, పిల్లనిఇంటి వద్దే ప్రభుత్వమే దింపుతోందన్నారు. రెండులక్షల యాభై వేలకేసీఆర్ కిట్లు పేద మహిళలకు అందాయన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ పేరుతో ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా ఈ సేనలువిస్తరింప జేయనున్నట్లు మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్షంగా నిలిచిందన్నారు. శాంతిభద్రతలు, పరిశ్రమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కరెంచ్, నీరు , రైతులకు పంట పెట్టుబడి, రైతు బీమా వంటి వాటిల్లో రాష్ట్రన్ని సీఎం కేసీఆర్ మొదటిస్థానంలో నిలిపారని చెప్పారు. మిషన్ భగీరథ వంటి పథకాన్ని తమ రాష్ట్రంలోను అమలుచేయాలని కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ప్రజలు డిమాండ్ చేయడం మన ప్రభుత్వ పని తీరుకు, సీఎం కేసీఆర్ ఆలోచన విధానానికి నిదర్శనమన్నారు.
కూకట్‌పల్లి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి – మంత్రి మహేందర్‌రెడ్డి
కోట్లాది నిధులతో కూకట్‌పల్లిని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది నిధులతో పథకాలను అమలు చేస్తుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్త మార్కెట్, రైతు బజార్ లను ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కూరగాయల సాగు చేసే రైతులకు మన కూరగాయల ఔట్ లెట్ లు జిల్లా పరిసరాల్లో 50 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇళ్ళు లేని నిరుపేదల కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లక్ష పట్టాలు, మరో లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లాలో జీర్ణావస్థలో ఉన్న 1450 చెరువులను రూ. 480 కోట్లతో పునరుద్ధరణ చేశామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ దేశానికి ఆదర్శం. నష్టాల మహిళా సంఘాలకు చేయూత నిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారావు, ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి పాల్గొన్నారు.




